సూర్య, సెంటినరీకాలనీ :సింగరేణి సంస్థలో విధులకు గైర్హాజరు కారణంగా ఉద్యోగాల నుండి తొలగించబడిన మాజీ కార్మికులకు యాజమాన్యం మరో అవకాశం కల్పించింది. 2023 జనవరి 1 నుంచి 2025 డిసెంబర్ 31 మధ్య కాలంలో గైర్హాజరు కారణంగా డిస్మిస్ అయిన ఉద్యోగుల కేసులను పున పరిశీలించి, తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకునే అంశాన్ని పరిశీలించాలని నిర్ణయించింది. ఇందుకోసం హైపవర్ కమిటీని ఏర్పాటు చేస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోల్‌బెల్ట్ ప్రాంత ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో డిస్మిస్ అయిన ఉద్యోగులకు తిరిగి ఉద్యోగ అవకాశం కల్పించాలని పలువురు ప్రజా ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఉప ముఖ్యమంత్రి, ఈ అంశాన్ని పరిశీలించాలని సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. ఈ నేపథ్యంలో అర్హులైన మాజీ ఉద్యోగులకు అవకాశం కల్పిస్తూ యాజమాన్యం మంగళవారం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ పునఃపరిశీలన కు దరఖాస్తు చేసుకునే మాజీ ఉద్యోగులు 2026 ఏప్రిల్ 1 నాటికి 46 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయస్సు కలిగి ఉండాలి. అలాగే ఉద్యోగం నుండి తొలగించబడిన తేదీకి ముందు ఉన్న ఐదు క్యాలెండర్ సంవత్సరాల్లో ఏవైనా రెండు సంవత్సరాలలో కనీసం 100 మస్టర్లు పూర్తి చేసి ఉండాలి. జనరల్ అసిస్టెంట్ ట్రైనీ (యుజి), కేటగిరీ-I పోస్టులో పునర్నియామకానికి అవసరమైన వైద్యపరమైన అర్హత కూడా కలిగి ఉండాలి. పై అర్హతలు కలిగిన మాజీ ఉద్యోగులు నిర్ణీత ప్రొఫార్మాలో దరఖాస్తును పూర్తి చేసి, తాము చివరిగా పనిచేసిన గని లేదా విభాగం అధిపతికి సమర్పించాలి. దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 14వ తేదీ చివరి తేదీగా నిర్ణయించారు. ఏరియా జనరల్ మేనేజర్లు అందిన దరఖాస్తులను పరిశీలించి, అర్హులైన అభ్యర్థుల వివరాలను తదుపరి చర్యల నిమిత్తం సంబంధిత అధికారులకు నిర్ణీత గడువులోగా పంపించాలని యాజమాన్యం ఆదేశించింది. ఈ అవకాశాన్ని అర్హులైన మాజీ ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సంస్థ సూచించింది. దరఖాస్తు ప్రొఫార్మా, ఇతర నిబంధనలు, పూర్తి వివరాల కోసం సంబంధిత గని లేదా శాఖ అధికారులను సంప్రదించాలని కోరింది.