శలాకకు ఉషశ్రీ శతజయంతి పురస్కారం శతజయంతి లోగో ఆవిష్కరణ సభలో రమణాచారి ప్రకటన
హైదరాబాద్, నవంబర్ 22 : మహామహోపాధ్యాయ శలాక రఘునాథ శర్మకు ఉషశ్రీ శతజయంతి వత్సర ఉషశ్రీ సంస్కృతి పురస్కారాన్ని అందజేయనున్నట్టు తెలంగాణ ప్రభుత్వ పూర్వ సలహాదారు కె.వి. రమణాచారి ప్రకటించారు. ఆయనతో పాటు సంస్కృత అవధాని కుమారి నృసింహదేవర జయలక్ష్మికి కూడా పురస్కారం అందిస్తామన్నారు. ఉషశ్రీ శతజయంతి మహోత్సవ శ్రీకర సభ ఆదివారం సాయంత్రం రవీంద్ర భారతి కాన్ఫెరెన్స్ హాలు ఏర్పాటైంది. ఈ సభకు రమణాచారి సభా సంచాలకులుగా వ్యవహరించారు. ప్రత్యేక అతిథులుగా రిటైర్డ్ ఐపీఎస్ ఏ.కె. ఖాన్, రామ్ దేవ్ రావు ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ కల్నల్ డాక్టర్ కమలాకర్, బ్యాంకింగ్ రంగ నిపుణుడు డాక్టర్ ఏ.ఎస్. రామశాస్త్రి, ప్రముఖ రచయిత, చిత్రకారుడు బినీం పాల్గొన్నారు.
ఉషశ్రీ శతజయంతి లోగోను, శతజయంతి మహోత్సవ శ్రీకారం పుస్తకాన్నీ విడుదల చేశారు. ఉషశ్రీ గారి రచనలు ఈ తరానికి చేరాలంటే ఆయన రచించిన రామాయణ, భారత, భాగవతాలను ఆంగ్లంలోకి తర్జుమా చేయించి అందుబాటులోకి తేవాలని డాక్టర్ కమలాకర్ సూచించారు. ఆయన రచనలన్లూ, ఆడియోలను విని తాను ఉషశ్రీ గారి గురించి తెలుసుకున్నారు చెప్పారు. అందుబాటులో ఉన్న ఆడియోలను రీల్స్ రూపంలో విడుదలచేస్తే, ఉషశ్రీ గారి గురించి ఈ తరానికి తెలుస్తుందని అభిప్రాయపడ్డారు. ఉషశ్రీ రచనలు ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరు ఎలా మాట్లాడారు చదివి వ్యక్తిత్వ వికాసానికి అవి ఎలా ఉపయోగపడతాయో ఏ.కె. ఖాన్ వివరించారు. ధర్మసందేహాలు కార్యక్రమాన్ని తానూ క్రమం తప్పకుండా వినేవాడినని చెప్పారు. డాక్టర్ ఏ.ఎస్. రామశాస్త్రి మాట్లాడుతూ, అతనికి అతనే సాటి అని ఉషశ్రీ గారి గురించి సోదాహరణంగా చెప్పారు. చిన్నప్పటినుంచి ఆయనను తాను చూశానని, రచనలను చదివానని, రేడియో ప్రసంగాలను విన్నానని వివరించారు. ఉషశ్రీ గారి స్వరం ఒక భాస్వరం అంటూ కె.వి. రమణాచారి అభివర్ణించారు. సంకల్ప బలం గట్టిగా ఉంటె, కార్యక్రమాలు అంతగా విజయవంతమవుతాయని బినీం చెప్పారు. ఉషశ్రీ కుటుంబం గట్టి సంకల్పంతో తలపెట్టిన శతజయంతి జయప్రదంగా జరుగుతుందని చెప్పారు. కె.వి.ఎస్. సుబ్రహ్మణ్యం కార్యక్రమానికి స్వాగతం పలికి వందన సమర్పణ చేశారు. ఉషశ్రీ గారి కుమార్తెలు డాక్టర్ గాయత్రీ దేవి, పద్మావతి, వైజయంతి ఈ సభలో పాల్గొన్నారు. వైజయంతి కార్యదర్శి నివేదికను సమర్పించారు. వల్లీశ్వర్, మిమిక్రీ శ్రీనివాస్, కె. రామచంద్ర మూర్తి, రంగవఝల భరద్వాజ్, శ్రీమతి అల్లూరి విజయలక్ష్మి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.