telangana
ఎమ్మెల్యే సొంత ఊర్లోనే 28 మందికి పింఛన్లు
సూర్య, హుజురాబాద్:ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సొంత ఊర్లోనే కొత్తగా 28 మందికి పింఛన్లు ఇచ్చామని, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసిన కౌశిక్ రెడ్డి దీంతో రాజీనామాకు సిద్ధమా...!? అని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ వొడితల ప్రణవ్ బాబు డిమాండ్ చేశారు. ఆదివారం హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... నియోజకవర్గంలో ఒక్క కొత్త పింఛన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదని, ఇచ్చినట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ఆర్భాటంగా కౌశిక్ రెడ్డి ప్రకటించాడని అన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజురాబాద్ నియోజకవర్గంలో మొత్తం 4221 మందికి వివిధ రకాల పింఛన్లు ప్రభుత్వం ఇచ్చిందని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం లో కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందన్నారు. విషయ పరిజ్ఞానం లేకుండా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కేవలం ప్రచారం కోసమే అబద్ధాలు మాట్లాడుతున్నాడని అన్నారు. ఇప్పటికైనా కౌశిక్ రెడ్డి తన స్థాయి తెలుసుకుని సీఎం పై చేసే విమర్శలు మానుకోవాలని అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ఇటీవల జరిగిన వివిధ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పాల్గొని పలువురికి పింఛన్లు ఆయన చేతులతోనే ఇచ్చాడని దీనికి ఈ ఫోటోలే రుజువులని అన్నారు. బిఆర్ఎస్ పార్టీకే చెందిన మాజీ మంత్రి మల్లారెడ్డి కొత్త పింఛన్లు తమ నియోజకవర్గంలో వచ్చాయని సీఎంకు కృతజ్ఞతలు చెప్పాడని అన్నారు. ఒకే పార్టీలో విషయ పరిజ్ఞానం లేని కౌశిక్ రెడ్డి తప్పుడు మాటలు మాట్లాడాడని అన్నారు. ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న కౌశిక్ రెడ్డి తన స్థాయిని మరిచి పిచ్చిపిచ్చి ఆరోపణలు చేస్తున్నారని, దీని వల్ల రాష్ట్రంలో హుజురాబాద్ నియోజకవర్గం పరువు పోతుందన్నారు. ఇందిరమ్మ ఇండ్లు కూడా నియోజకవర్గంలో అర్హులైన వారికి ఇచ్చారని, మరికొంత మందికి కూడా త్వరలోనే ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యేగా కౌశిక్ రెడ్డి గెలిచి
మూడు సంవత్సరాలు అయ్యాయని, ఇప్పటి వరకు నియోజకవర్గానికి ఆయన చేసిన పనులు ఏమిటో స్పష్టం చేయాలన్నారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా హైదరాబాద్ లో కూర్చుని విలేకరులతో మాట్లాడితే పెద్ద లీడర్ కాలేరని అన్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తూ పరువు తీసుకుంటున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ టికెట్ కూడా ఇవ్వదని, ఇచ్చిన డిపాజిట్ కూడా రాదని ఆయన ఎద్దేవా చేశారు. అభివృద్ధి విషయంలో సిరిసిల్ల, కొడంగల్ నియోజకవర్గం పోటీ పెడదామా... ఎవరు గెలుస్తారో చూద్దామన్నారు. సాచురేషన్ పద్ధతిలో పింఛన్లు వస్తాయని అన్నారు. హుందాగా ఉండవలసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇప్పటికైనా తన తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్పాలని అంబేద్కర్ విగ్రహం వద్ద ముక్కు భూమికి రాయాలని అన్నారు. కాగా ఈ సమావేశంలో వీణవంక, జమ్మికుంటకు చెందిన పలువురు ఆసరా పింఛన్ వచ్చిన లబ్ధిదారులతో మాట్లాడించారు. ఈ సమావేశంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రొoటాల సుహాసిని, పట్టణ అధ్యక్షులు మేకల తిరుపతి, నాయకులు సొల్లు బాబు, కౌన్సిలర్లు మొగిలి, కో ఆప్షన్ సభ్యులు గొట్టే జమదగ్ని, ఎండి. అలీమ్, హనుమాన్ దేవాలయ చైర్మన్ కొలిపాక శంకర్, దేశిని కోటి, మండల అధ్యక్షురాలు పుల్ల రాధ, తాళ్లపెళ్లి రమేష్ గౌడ్, అశు, ప్రజాప్రతితులు పాల్గొన్నారు.