telangana
అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు నిరంతర పోరాటం
సూర్య పెద్దపల్లి ప్రతినిధి ;;;అణగారిన వర్గాలపై జరుగుతున్న దాడులు, అన్యాయాలను ఎదుర్కొంటూ వారి హక్కుల పరిరక్షణకు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నిరంతరం పోరాడుతుందని నేషనల్ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్ అన్నారు. 1977లో ప్రారంభమైన ఈ సంఘం 50 ఏళ్లుగా సామాజిక న్యాయం, దళితుల హక్కుల కోసం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్‌ఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం స్వర్ణోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా సంఘం ఆవిర్భావం, ఉద్యమ ప్రస్థానాన్ని వివరించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మామిడిపల్లి బాపయ్య సంఘం బలోపేతానికి విశేష కృషి చేశారని కొనియాడారు.
ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ తన తాత స్వర్గీయ గడ్డం వెంకటస్వామి ఆశయాలను కొనసాగిస్తూ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతికి, పేద విద్యార్థుల ఉన్నత విద్యకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ పెద్దపల్లి ప్రాంతంలో అంబేద్కర్ సంఘం అంటేనే మామిడిపల్లి బాపయ్య గుర్తుకొస్తారని, ఆయన సంఘం అభివృద్ధికి చేసిన సేవలు ప్రశంసనీయమని అన్నారు. డీసీపీ భూక్య రాంరెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ అందరివాడని, ఆయన ఆశయాలు, రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మామిడిపల్లి బాపయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, పలువురు సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.