telangana
యువత భవితకు క్రీడలే బాట
సూర్య పెద్దపల్లి ప్రతినిధి ;;యువత ఉజ్వల భవిష్యత్తుకు క్రీడలే సరైన మార్గమని, మత్తు పదార్థాలు, చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడల్లో రాణించాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు పిలుపునిచ్చారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ ప్రోత్సాహం అందించాలని సూచించారు.
పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో తన జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు కర్రే నరేష్ నిర్వహించిన విజ్జన్న క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఫైనల్లో విజయం సాధించిన పెద్దపల్లి ఆర్.జే.11 జట్టుకు రూ.లక్ష నగదు, విన్నర్ ట్రోఫీని, రన్నరప్‌గా నిలిచిన సిరిసిల్ల రాజన్న జట్టుకు రూ.50 వేల నగదు, ట్రోఫీని అందజేశారు. పలువురు క్రీడాకారులకు మెమెంటోలు ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలను వీడి మైదానాల బాట పట్టాలని, క్రీడాకారులను నాయకులు ప్రోత్సహించాలని కోరారు. తన జన్మదినం సందర్భంగా టోర్నమెంట్ నిర్వహించి యువతను క్రీడల వైపు ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇస్తోందని, పెద్దపల్లిలో స్టేడియం నిర్మాణానికి స్థల పరిశీలన చేస్తున్నామని తెలిపారు.
అనంతరం పట్టణంలోని ఆర్.ఆర్. గార్డెన్స్‌లో నిర్వహించిన ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం స్వర్ణోత్సవ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరై, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.