BREAKING
రవిప్రకాష్‌కు కీర్తి పురస్కారం స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పనులను పరిశీలించిన కేఎల్ఆర్ మురసు తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న ఉద్యాన పంటలు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందం గ్రామసభలో విద్యార్థుల గళం నాలుగు అడుగుల ముసలి కలకలం..! ఎల్‌నినోపై విద్యార్థుల ర్యాలీ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి లోకేష్ ఘనస్వాగతం అందుబాటు ధరల్లో క్యాన్సర్ మందులు: రోగుల ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యం – శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా *నారాయణ బెస్ట్ ఫౌండేషన్ స్కూల్ లో ఘనంగా బాలోత్సవ వేడుకలు..* APRS సంతనూతలపాడు పాఠశాలకు ప్రశంశాపత్రం విట్లంపల్లి తాగునీటికి శాశ్వత పరిష్కారం.. లక్ష డిజిటల్ ఎంఎస్ఎంఈల తయారీకి 50 కేంద్రాలు: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రూఫ్‌టాప్ సోలార్‌లో ఏపీ దేశానికే ఆదర్శం: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపికి తుఫాన్ ముప్పు! స్వర్ణ,డా. ప్రవీణ్ కుమార్ వివాహ రెసెప్షన్ కు హాజరైన పారిశ్రామిక వేత్త శిద్దా సుధీర్ కుమార్

సామాజిక న్యాయంతోనే సంపూర్ణ ప్రజాస్వామ్యంః మంత్రి పొన్నం ప్రభాకర్

Select Suryaa Now
 సామాజిక న్యాయంతోనే సంపూర్ణ ప్రజాస్వామ్యంః మంత్రి పొన్నం ప్రభాకర్

సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిధిః సామాజిక న్యాయం లేకుండా సంపూర్ణ ప్రజాస్వామ్యం సాధ్యం కాదని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు, సమాన హక్కులు కల్పించడంతో పాటు అణగారిన వర్గాలకు అభివృద్ధిలో సముచిత వాటా కల్పించినప్పుడే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కులు, అభివృద్ధి వంటి కీలక అంశాలపై చర్చించేందుకు జరుగుతున్న భారత్ సమ్మిట్ - 2026లో భాగంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ ప్యానెల్‌లో సామాజిక న్యాయంపై జరిగిన చర్చలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం సామాజిక న్యాయం అమలులో దేశానికే రోల్ మోడల్‌గా నిలుస్తోందని అన్నారు. సామాజిక న్యాయం అనేది కేవలం ప్రభుత్వ విధానం కాదని, సమాజం తన పౌరులకు ఇచ్చే గౌరవమని వివరించారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానత్వపు హక్కును కల్పించిందని, కులం, మతం, ప్రాంతం, భాష, ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ గౌరవంగా జీవించే హక్కు కలిగి ఉన్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు హక్కు మాత్రమే కాదని, నిర్ణయాలు తీసుకునే ప్రతి వ్యవస్థలో అన్ని వర్గాలకు భాగస్వామ్యం ఉండాలని అన్నారు. అధికారంలో వాటా, అభివృద్ధిలో భాగస్వామ్యం లేనప్పుడు సమానత్వం కేవలం రాజ్యాంగంలోని పదంగానే మిగిలిపోతుందని పేర్కొన్నారు. సామాజిక న్యాయం సాధించాలంటే ముందుగా సమాజంలోని అసమానతలను గుర్తించాలని, ఏ వర్గానికి ఎంత జనాభా ఉంది? విద్య, ఉద్యోగాలు, ఆర్థిక పరిస్థితులు, రాజకీయ ప్రాతినిధ్యంలో వారి స్థానం ఏమిటి? అనే అంశాలపై కచ్చితమైన సమాచారం ఉండాలని తెలిపారు.
కులగణన అనేది కులాలను విభజించడానికి కాదని, తరతరాలుగా వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయడానికి అని స్పష్టం చేశారు. ఎవరి హక్కులను లాక్కోవడానికి కాకుండా, వారికి దక్కాల్సిన హక్కులు అందించడమే కులగణన ముఖ్య ఉద్దేశమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం తెలంగాణలో సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కులగణన సర్వే నిర్వహించి దేశానికి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. ఈ సర్వేలో రాష్ట్రంలో బీసీల జనాభా 56.36 శాతంగా వెల్లడైందని, ఇది కేవలం గణాంకం మాత్రమే కాదని, ప్రభుత్వ విధాన నిర్ణయాలు, సంక్షేమ కార్యక్రమాలు, అవకాశాల కల్పనలో ప్రాతిపదికగా ఉండాల్సిన సామాజిక వాస్తవమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కూడా శాస్త్రీయంగా, పారదర్శకంగా కులగణన నిర్వహించాలని, జనాభాకు అనుగుణంగా అన్ని వర్గాలకు హక్కులు, అవకాశాలు, ప్రాతినిధ్యం కల్పించే దిశగా దేశం ముందుకు సాగాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో సామాజిక న్యాయాన్ని మాటలకే పరిమితం చేయకుండా క్షేత్రస్థాయిలో అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా లక్ష మంది సామాజిక న్యాయ సర్వే సిబ్బంది ఇంటింటికీ వెళ్లి సమగ్రంగా డేటా సేకరించారని చెప్పారు. ఎంపిరికల్ డేటా ఆధారంగా 50 శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని కోరుతున్నామని పేర్కొన్నారు. భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ సామాజిక న్యాయంపై చేసిన సూచనలను ప్రస్తావిస్తూ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కులగణన నిర్వహించి, సామాజిక న్యాయంపై అధ్యయనం చేసేందుకు రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కమిటీలో ప్రొఫెసర్ కంచె ఐలయ్యను వైస్ చైర్మన్‌గా, ముత్యం బల్గారిని సభ్యుడిగా నియమించామని వివరించారు.
తెలంగాణ ప్రభుత్వం బీసీలకు విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోందని అన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర శాసనసభలో చట్టాన్ని ఆమోదించడం ఈ దిశగా కీలక అడుగు అని పేర్కొన్నారు. బీసీలకు జనాభా నిష్పత్తి ప్రకారం అవకాశాలు కల్పించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని, ఈ లక్ష్యం నెరవేరేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా అవసరమైన సహకారం అందించాలని కోరారు.
దేశంలో ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించినప్పుడు, బీసీలకు కూడా ఎంపిరికల్ డేటా ఆధారంగా న్యాయం జరగాలని అన్నారు. బీసీలు కేవలం ఓటు బ్యాంకుగా మిగిలిపోకూడదని, పాలనలో భాగస్వాములు కావాలని, విధాన నిర్ణయాల్లో వారి గొంతుక వినిపించాలని, చట్టసభలు, స్థానిక సంస్థలు, విద్యా, ఉద్యోగ రంగాల్లో తగిన అవకాశాలు లభించాలని స్పష్టం చేశారు. బీసీల అభివృద్ధి, సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం బీసీల హక్కుల కోసం అనేక ప్రభుత్వపరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బీసీలకు న్యాయం జరిగేలా తీసుకున్న ప్రతిపాదనలను ఆమోదించి గౌరవనీయులైన లోక్‌సభ స్పీకర్‌తో పాటు కేంద్ర ప్రభుత్వానికి పంపించామని వివరించారు. జాతీయ స్థాయిలో బీసీలకు న్యాయమైన వాటా, హక్కులు కల్పించే వరకు పార్లమెంట్‌లో కూడా తమ గొంతు వినిపిస్తామని పేర్కొన్నారు. సామాజిక న్యాయం అనేది రిజర్వేషన్లకే పరిమితం కాకూడదని మంత్రి అన్నారు. ప్రతి పేద బీసీ విద్యార్థికి నాణ్యమైన విద్య అందాలని, ప్రతి యువకుడికి ఉపాధి అవకాశం కలగాలని, సంప్రదాయ వృత్తులపై ఆధారపడిన కుటుంబాలకు ఆధునిక సాంకేతికత, ఆర్థిక సహకారం, మార్కెట్ అవకాశాలు కల్పించాలని చెప్పారు. కులవృత్తులు చేసుకునే వారు గౌరవంగా, ఆర్థికంగా స్వయం సమృద్ధితో జీవించే పరిస్థితులు కల్పించాలన్నారు. బీసీ కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాలు, విద్యార్థులకు సంక్షేమ వసతులు, అర్హులైన పేదలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా సామాజికంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. మహిళలు, దివ్యాంగులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, బీసీలు, ఇతర బలహీన వర్గాలు అభివృద్ధి ప్రయాణంలో వెనుకబడకుండా చూడటం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ప్రపంచం వేగంగా మారుతోందని, టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ఎకానమీ కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నాయని అన్నారు. అభివృద్ధి అంటే కేవలం పెట్టుబడులు, పరిశ్రమలు, సంపద సృష్టి మాత్రమే కాదని, ఆ సంపదను సృష్టించే కార్మికుడికి గౌరవం, భద్రత, న్యాయం కల్పించడం కూడా అభివృద్ధిలో భాగమేనని వివరించారు. ఒక దేశం ఎంత సంపన్నమైనదో దాని జీడీపీతో మాత్రమే కొలవకూడదని, ఆ దేశంలో అత్యంత పేదవాడు ఎంత గౌరవంగా జీవిస్తున్నాడు? మహిళకు ఎంత భద్రత ఉంది? వెనుకబడిన సామాజిక వర్గానికి ఎన్ని అవకాశాలు లభిస్తున్నాయి? అనే అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. ప్రపంచ దేశాలు సామాజిక న్యాయం, మానవ గౌరవం, సమాన అవకాశాల కోసం పరస్పరం అనుభవాలను పంచుకోవాలని, ప్రజాస్వామ్య వ్యవస్థలను మరింత సమ్మిళితంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తోందని మంత్రి తెలిపారు. అభివృద్ధి అంటే కొందరి చేతుల్లో సంపద కేంద్రీకృతం కావడం కాదని, సమాజంలోని ప్రతి వర్గానికి అభివృద్ధి ఫలాలు అందడమేనని స్పష్టం చేశారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బీసీలకు న్యాయం జరగాలని, అణగారిన వర్గాలకు అవకాశాలు కల్పించాలని, ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్య, ప్రతి యువకుడికి ఉపాధి, ప్రతి కుటుంబానికి ఆత్మగౌరవంతో జీవించే అవకాశం కల్పించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. సామాజిక న్యాయం అనేది ఎవరికో వ్యతిరేకంగా చేసే పోరాటం కాదని, తరతరాలుగా అవకాశాలకు దూరమైన వారికి న్యాయంగా అవకాశాలు కల్పించే ప్రజాస్వామ్య ప్రక్రియ అని అన్నారు. సమానత్వం లేని అభివృద్ధి అసంపూర్ణమని, సామాజిక న్యాయం లేని ప్రజాస్వామ్యం బలహీనమని, అన్ని వర్గాలకు సముచిత భాగస్వామ్యం కల్పించని సమాజం నిజమైన పురోగతిని సాధించలేదని పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వాన్ని ఆచరణలోకి తీసుకురావడమే మనందరి బాధ్యత అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రతిభకు అవకాశాలు కల్పించాలని, అణగారిన వర్గాలకు న్యాయం చేయాలని, ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు అందించాలని, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం పునాదులపై కొత్త భారతదేశాన్ని నిర్మించాలని తన ప్రసంగంలో పిలుపునిచ్చారు.
ఎ.రవీందర్‌, హైదరాబాద్‌.