రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు మెట్లకుంట విద్యార్థి రిహాన్ ఎంపిక
బొంరాస్‌పేట్, మేజర్ న్యూస్: కొడంగల్ నియోజకవర్గం బొంరాస్‌పేట్ మండలం మెట్లకుంట గ్రామానికి చెందిన విద్యార్థి ఎం.డి. రిహాన్ రాష్ట్రస్థాయి అండర్-14 కబడ్డీ పోటీలకు ఎంపికై ప్రతిభ చాటుకున్నాడు. పరిగిలోని న్యూ బ్రిలియంట్ హైస్కూల్‌లో విద్యనభ్యసిస్తున్న రిహాన్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కబడ్డీ జట్టు తరఫున రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించాడు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి పోటీల్లో తన ఆటతీరుతో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. బొంరాస్‌పేట్ మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఎం.డి. హాజీ బాబా తనయుడైన రిహాన్ చిన్న వయస్సులోనే క్రీడలపై ఆసక్తి పెంచుకుని పట్టుదలతో సాధన చేస్తూ రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం గ్రామానికి గర్వకారణంగా నిలిచింది. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గానికి చెందిన గ్రామీణ విద్యార్థి ఈ ఘనత సాధించడంతో మెట్లకుంట గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా పరిగిలోని న్యూ బ్రిలియంట్ హైస్కూల్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ రమేష్, వ్యాయామ ఉపాధ్యాయులు రిహాన్‌ను ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో విజయం సాధించి భవిష్యత్తులో జాతీయస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. రిహాన్ విజయంపై గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, క్రీడాభిమానులు అభినందనలు తెలియజేశారు.