telangana
సహజ ప్రసవమే శ్రేయస్కరం.. తల్లీబిడ్డలకు ఆరోగ్యకరం - అనవసర సిజేరియన్లను నివారించాలి - డీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజగోపాల్ రావు
సూర్య కరీంనగర్ : వైద్యపరంగా సురక్షితమైన సందర్భాల్లో సహజ ప్రసవాలను ప్రోత్సహించడం ద్వారా తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడవచ్చని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజగోపాల్ రావు అన్నారు. ఆదివారం కోతిరాంపూర్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో సొసైటీ ఆఫ్ మిడ్‌వైవ్స్ ఇండియా (సోమీ) తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వాక్ ఫర్ నేచురల్ బర్తింగ్’ అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. సహజ ప్రసవం వల్ల తల్లి త్వరగా కోలుకోవడంతోపాటు తల్లీబిడ్డల అనుబంధం పెరుగుతుందని, వైద్యపరంగా అవసరం లేని సిజేరియన్లను నివారించాలని సూచించారు. ప్రసవ సమయంలో తల్లులకు ధైర్యం, మానసిక సహకారం అందించడంలో మిడ్‌వైవ్స్ కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు. కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించిన ర్యాలీలో కరపత్రాలు పంపిణీ చేసి సహజ ప్రసవాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, సోమీ కోఆర్డినేటర్ లిల్లీ మేరీ, వైస్ ప్రిన్సిపాల్ ఉమా మహేశ్వరి, సుజాత, అధ్యాపకులు, నర్సింగ్ విద్యార్థినులు పాల్గొన్నారు.