పొదిలి పట్టణాన్ని మరింతగా అభివృద్ధి చేస్తాం - మార్కాపురం శాసనసభ్యులు కందుల
మార్కాపురం, మేజర్‌న్యూస్ :
మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి పొదిలి నగర పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కూటమి చైర్మన్ అభ్యర్థి వరికుంట్ల అనిల్ కుమార్ మరియు ఆయా వార్డు అభ్యర్థులకు మద్దతుగా పొదిలి పట్టణంలోని కాటూరి వారి పాలెం , రాజుపాలెం , టైలర్స్ కాలనీ లలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం 3000 రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్పి నాలుగున్నర సంవత్సరాల కాలం వెళ్ళబుచ్చారని అదే తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే మూడువేల రూపాయల పెన్షన్ 4000 రూపాయలు చేసామని, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని చెప్పి ఒకరికే దాన్ని పరిమితం చేశారని కానీ తమ ప్రభుత్వం ఇంటిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నా వారందరికీ తల్లికి వందనం పేరుతో 13 వేల రూపాయలు చెల్లిస్తున్నామని అన్నారు.
పూర్తికాని వెలుగొండ ప్రాజెక్టు కు శంకుస్థాపన చేసి ప్రజలను నెట్టు నిలువునా మోసం చేశారని అదే తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే మూడు వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టు పూర్తి చేసి నీటిని అందించామని గుర్తు చేశారు.
తమ ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధితో రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకు వెళుతున్నామని కానీ వైసీపీ నాయకులు సంక్షేమం ముసుగులో అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టేసారని అన్నారు.
130 కోట్ల రూపాయలతో ఇంటింటికి పైప్ లైన్ త్రాగునీరు అందించడానికి త్వరితగతిన పనులు జరుగుతున్నాయని వచ్చే ఆరు నెలల్లో ప్రతి ఇంటికి పైప్ కనెక్షన్ అందజేస్తామని అన్నారు.
పొదిలి పట్టణ అభివృద్ధి కోసం 20 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని త్వరలో పొదిలి పట్టణంలో సిసి రోడ్లను నిర్మిస్తామని అన్నారు.
కల్లబొల్లి మాటలు చెప్పే వైసిపి నాయకులు కావాలో ఇచ్చిన మాట కట్టుబడి ప్రతి హామీని అమలు చేసి మరింతగా అభివృద్ధి చేసే కూటమి ప్రభుత్వం కావాలో తేల్చుకోవాలని అని ప్రజలను అన్నారు.
వైసీపీకి ఓటు వేస్తే అది మురిగిపోతుందని అది దృష్టిలో ఉంచుకొని ఈ నెల 26వ తేదీన జరిగే నగర పంచాయతీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా వరికుంట్ల అనిల్ కుమార్ గారిని, కూటమి వార్డు అభ్యర్థులను గెలిపించి పొదిలి పట్టణాన్ని మరింతగా అభివృద్ధి చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.