telangana
పప్పు దినుసుల రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్ - చొప్పదండి సహకార సంఘం వినూత్న కార్యక్రమం ఆదర్శనీయం - కలెక్టర్ చిత్రా మిశ్రా
సూర్య కరీంనగర్ ప్రతినిధి : పప్పు దినుసుల సాగు చేసే రైతులకు కనీస మద్దతు ధరకు అదనంగా క్వింటాలుకు రూ.500 బోనస్ అందించేలా చొప్పదండి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చేపట్టిన వినూత్న కార్యక్రమం అభినందనీయమని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ప్రశంసించారు. రైతులకు అదనపు ఆదాయం కల్పించే ఈ విధానం జిల్లాలోని ఇతర ప్రాంతాలకు కూడా ఆదర్శంగా నిలవాలని, ఈ కార్యక్రమం ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలపై జిల్లావ్యాప్తంగా విస్తృత అవగాహన కల్పించాలని వ్యవసాయ, సహకార శాఖల అధికారులను ఆదేశించారు. ఎల్‌నినో నేపథ్యంలో రానున్న కాలంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నందున రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకొని తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని సూచించారు. పప్పు దినుసుల సాగు విస్తరణకు బోనస్ వంటి ప్రోత్సాహక కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. చొప్పదండి సహకార సంఘం కార్యక్రమం ఉద్దేశం, రైతులకు అందే అదనపు ఆదాయం, పంట సాగు నుంచి కొనుగోలు వరకు కల్పించే అవకాశాలపై గ్రామస్థాయిలో విస్తృత ప్రచారం చేయాలని, ఇతర సహకార సంఘాలు కూడా ఈ విధానాన్ని అనుసరించేలా ప్రోత్సహించాలని అన్నారు. రైతులకు విత్తనాల సరఫరా నుంచి పంట కొనుగోలు, ప్రాసెసింగ్, మార్కెటింగ్ వరకు సమగ్ర సహకారం అందించేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. నీటి లభ్యతకు అనుగుణంగా ఆరుతడి పంటలను ఎంచుకునేలా రైతులకు అవగాహన కల్పించాలని, మండలాల వారీగా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలతో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించి పంటల మార్పిడిపై సూచనలు అందించాలని ఆదేశించారు. జిల్లాలో ఆయిల్‌పామ్ సాగును విస్తరించాలని, ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని, కూరగాయల సాగును ప్రోత్సహించడంతోపాటు పందిళ్ల ఏర్పాటు, డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ల వినియోగానికి రైతులకు అవసరమైన సహకారం అందించాలని పేర్కొన్నారు. వి.బి.జి. రామ్‌జీ పథకం కింద జిల్లాలో 200 ఎకరాల్లో పశుగ్రాసం పెంపకానికి చర్యలు తీసుకోవాలని, ఆసక్తి ఉన్న రైతులను గుర్తించి అవసరమైన పనుల మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పశుసంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు. భూగర్భ జలాలను పెంపొందించేందుకు గ్రామాల్లో ఇంటింటికీ ఇంకుడు గుంతలు, రైతుల పొలాల్లో నీటి కుంటలు, తాగునీటి బోర్లకు రీఛార్జ్ వ్యవస్థలు ఏర్పాటు చేయడంతోపాటు వర్షపు నీటిని ఒడిసిపట్టి ప్రతి గ్రామంలో జలసిరి కనిపించేలా సమగ్ర కార్యాచరణ చేపట్టాలని సూచించారు. నాబార్డు, డీసీసీబీ ద్వారా అమలవుతున్న పథకాలపై రైతులకు అవగాహన కల్పించి అవసరమైన ఆర్థిక సహాయం అందేలా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని, ఆధునిక సాగు విధానాలు, నీటి పొదుపు పద్ధతులపై రైతులకు నిరంతరం మార్గనిర్దేశం చేయాలని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, డీఆర్డీఏ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో తెలిపారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి చత్రు నాయక్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి, డీఆర్డీఓ గీత, జిల్లా పశువైద్యాధికారి లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.