జైలు జీవితం తర్వాత ఎదురయ్యే సవాళ్లపై రష్యన్ చిత్రం న్యూ హోమ్
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: జైలులో సుదీర్ఘకాలం గడిపిన తర్వాత తిరిగి సమాజంలో కలిసిపోవడానికి, జీవితాన్ని కొత్తగా నిర్మించుకోవడానికి మాజీ ఖైదీలు అనేక సవాళ్లను ఎదుర్కొంటారని రష్యా సినీ దర్శకుడు నికితా గ్రుషిన్ పేర్కొన్నారు. గోవాలో జరుగుతున్న 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన తన చిత్రం న్యూ హోమ్ గురించి వివరాలను పంచుకున్నారు. ఈ చలనచిత్రోత్సవంలో ఈ సినిమా ప్రపంచ ప్రీమియర్‌గా ప్రదర్శితమవుతోంది. 101 నిమిషాల నిడివి గల ఈ రష్యన్ భాషా చిత్రాన్ని ఐఎఫ్‌ఎఫ్‌ఐ 2026లో పార్టనర్ కంట్రీగా ఉన్న రష్యా ప్రత్యేక ప్రదర్శనలో భాగంగా రూపొందించారు.
దీర్ఘకాల జైలు శిక్ష అనంతరం పునరావాసం పొందుతున్న వ్యక్తులతో తాను జరిపిన సంభాషణలే ఈ సినిమా కథకు ప్రేరణ నిచ్చాయని దర్శకుడు వివరించారు. జైలు నుంచి విడుదలైన వారు జీవితాలను తిరిగి గాడిలో పెట్టుకునే క్రమంలో ఎదుర్కొనే కష్టాలకు తగినంత దృష్టి లభించడం లేదని అభిప్రాయపడ్డారు. నికితా గ్రుషిన్ రచన, దర్శకత్వం వహించిన న్యూ హోమ్ చిత్రం ఏడేళ్ల జైలు శిక్ష తర్వాత విడుదలైన అన్నా అనే మహిళ చుట్టూ తిరుగుతుంది. డబ్బు, కుటుంబం లేదా స్పష్టమైన మార్గదర్శకత్వం లేని స్థితిలో సమాజంలో తన స్థానాన్ని ఏర్పరచుకునేందుకు ఆమె పడే తపనను ఈ కథలో చూపించారు.
సామాజిక సేవల సహాయంతో అన్నా ఉద్యోగం, వసతి పొందడంతో పాటు ఒక సపోర్ట్ గ్రూప్‌లో చేరుతుంది, అక్కడ ఆమెకు రోమన్ పరిచయం అవుతాడు. జీవితాన్ని కొత్తగా ప్రారంభించే ప్రయత్నంలో ఆమె తన గతం, అపరాధ భావనలు, క్లిష్టమైన వ్యక్తిగత నిర్ణయాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పునరావాసం, క్షమ, ఆమోదం మరియు కొత్త ఆరంభం వంటి సున్నితమైన అంశాలను ఈ చిత్రం లోతుగా చర్చిస్తుంది. అన్నా పాత్ర ఏ ఒక్క వ్యక్తి జీవిత కథ కాదని, అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్న పలువురి అనుభవాల ఆధారంగా రూపొందించిన కల్పిత పాత్ర అని గ్రుషిన్ స్పష్టం చేశారు.
దర్శకుడితో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న ఛాయాగ్రాహకురాలు ఎకాటెరినా స్మోలినా తమ సృజనాత్మక భాగస్వామ్యం గురించి మాట్లాడటంతో పాటు, సినిమాటోగ్రఫీ రంగంలోకి రావాలనుకునే యువతులు ఆత్మవిశ్వాసం, పట్టుదలతో ముందుకు సాగాలని ప్రోత్సహించారు. భారతీయ మరియు రష్యన్ సినిమాల మధ్య సహకారానికి ఉన్న విస్తృత అవకాశాలను ప్రస్తావిస్తూ, సోవియట్ యూనియన్ కాలం నుంచి భారతీయ చిత్రాలకు ఉన్న ఆదరణను, రష్యా ప్రేక్షకులలో వాటికి ఉన్న క్రేజ్‌ను గ్రుషిన్ గుర్తు చేశారు. భవిష్యత్తులో ఇరు దేశాల సినీ భాగస్వామ్యం కేవలం ఆర్థిక పెట్టుబడులు, సాంకేతిక మార్పిడికే పరిమితం కాకుండా సాంస్కృతిక బంధాలను పెంచే కథలపై దృష్టి పెట్టాలని సూచించారు. సరిహద్దులు లేని కథలు అనే ఐఎఫ్‌ఎఫ్‌ఐ ఇతివృత్తానికి అనుగుణంగా ఈ చిత్రం మానవ అనుభవాలను మరింత దగ్గర చేస్తుందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేసింది.