ప్రతి ఇంటికీ ఇందిరమ్మ కుటుంబ బీమా.. అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలి:మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మన్నే శంకర్ యాదవ్
మోమిన్‌పేట్, మేజర్ న్యూస్: ఆపద సమయంలో పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19వ తేదీ నుంచి ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు మోమిన్‌పేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మన్నే శంకర్ యాదవ్ తెలిపారు. ఈ పథకం ద్వారా 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన కుటుంబ యజమానికి రూ.5 లక్షల బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 1967 నవంబర్ నుంచి 2008 నవంబర్ వరకు జన్మించిన వారు ఈ పథకానికి అర్హులని తెలిపారు. రేషన్ కార్డు కలిగిన కుటుంబాలతో పాటు రేషన్ కార్డులు లేని అర్హులైన కుటుంబాలకు కూడా ఈ పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు. అయితే ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే బీమా సదుపాయం కల్పిస్తారని వివరించారు. అర్హులైన కుటుంబాలకు సంబంధిత అధికారులు దరఖాస్తు ఫారాలను అందజేస్తారని తెలిపారు.నవంబర్ 19 నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు నెల రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దరఖాస్తు ఫారంతో పాటు ఆధార్ కార్డు, ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్, రేషన్ కార్డు వివరాలను జతచేసి సంబంధిత అధికారులకు అందజేయాలని సూచించారు. మండలంలోని అన్ని గ్రామాల గ్రామపంచాయతీ కార్యాలయాల్లో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేసి అర్హులైన ప్రతి కుటుంబానికి ఈ పథకంపై అవగాహన కల్పించాలని, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.