ప్రతి ఇంటా ఇంకుడు గుంత నిర్మాణం చేపట్టాలి
షాబాద్ మేజర్ న్యూస్ (నవంబర్ 11)
వర్షపు నీటిని వృథా కాకుండా ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించేందుకు ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని డీఎల్పీవో సతీష్, ఎంపీడీవో అపర్ణ సూచించారు. షాబాద్ మండల పరిధిలోని కుమ్మరిగూడ గ్రామంలో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతలను గ్రామ సర్పంచ్ పోనమోని శ్రీశైలం యాదవ్‌తో కలిసి బుధవారం వారు పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ... వర్షాకాలంలో కురిసే ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టుకోవడం ద్వారా భవిష్యత్తులో నీటి కొరతను నివారించవచ్చని తెలిపారు. ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవడం వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకి భూగర్భ జలమట్టం పెరుగుతుందని వివరించారు. నీటి వనరులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని, గ్రామంలోని ప్రతి కుటుంబం ఇంకుడు గుంతల నిర్మాణానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో నీటి సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఇంకుడు గుంతల నిర్మాణాన్ని మరింత ప్రోత్సహించాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. పర్యావరణ పరిరక్షణ, భవిష్యత్తు తరాలకు నీటి భద్రత కల్పించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో నాసరయ్య, పంచాయతీ కార్యదర్శి యాదయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ నర్సింహులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.