BREAKING
దుర్గాలమ్మ ఆలయ నిర్మాణానికి రూ.50 వేలు విరాళం. అంగన్వాడీలకు ముగిసిన రెండో విడత శిక్షణ. చోరీ కేసుల్లో నిందితుడికి జైలు శిక్ష. రణ్‌బీర్ కపూర్ 'రామాయణం' సినిమాపై మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని ఆసక్తికర రివ్యూ! మేయర్ శ్రావణికి నీలబాబు అభినందన పిల్లల సమగ్ర అభివృద్ధిపై అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ విద్యతోనే అభివృద్ధి సాధ్యం. ఉచిత మెగా వైద్య శిబిరంలో 236 మందికి పరీక్షలు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన జబర్దస్త్ కమెడియన్ పటాస్ ప్రవీణ్ దంపతులు.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన కడెం వంశిత! అంగన్వాడీలకు పోషకాహారంపై అవగాహన తెల్ల బియ్యానికి బదులు ఎర్ర బియ్యం తింటే ఇన్ని లాభాలా.. ఆరోగ్య నిపుణులు చెబుతున్న అద్భుతమైన ప్రయోజనాలు! త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు:మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మేజర్ పంచాయితీ మనదే కావాలి... జాతీయ స్థాయి పోటీలకు పి ఎం శ్రీ మోడల్ స్కూల్ విద్యార్థులు.. బోరవానిపేటలో కేంద్ర బృందం పర్యటన ఏర్పాట్లులను పరిశీలన

"రాజా"నగరంలో బత్తుల పరాభవం!

Select Suryaa Now
"రాజా"నగరంలో బత్తుల పరాభవం!

రాజానగరం: మేజర్ న్యూస్,తూర్పుగోదావరి జిల్లా రాష్ట్రవ్యాప్తంగా ఒక లెక్క.. రాజానగరం నియోజకవర్గంలో మరో లెక్క అన్న చందంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో అధికార కూటమి ఆధిపత్యం కనిపించినప్పటికీ రాజానగరంలో మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటింది. టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు కలిసి కూటమిగా పోటీ చేసినప్పటికీ వైసీపీ అభ్యర్థులు గట్టి పోటీనిచ్చి పలు స్థానాలను కైవసం చేసుకున్నారు. ముఖ్యంగా రెండు మండలాల్లో ఎంపీపీ పీఠాలను దక్కించుకోవడంతో పాటు నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సతీమణి వెంకటలక్ష్మిని జడ్పీటీసీ ఎన్నికల్లో ఓడించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా రచించిన రాజకీయ వ్యూహాలు ఈ ఫలితాల్లో ప్రభావం చూపించాయని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. సీతానగరం జడ్పీటీసీ స్థానంలో జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సతీమణి వెంకటలక్ష్మి పోటీ చేయగా, వైసీపీ అభ్యర్థి కరుటూరి శ్రీహరిబాబు 2,637 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఎమ్మెల్యే కుటుంబానికి ఎదురైన ఈ ఓటమి నియోజకవర్గ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

సీతానగరంలో వైసీపీ స్పష్టమైన ఆధిపత్యం

సీతానగరం మండలంలో మొత్తం 20 ఎంపీటీసీ స్థానాలకు గాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 12 స్థానాల్లో విజయం సాధించి ఎంపీపీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ను సాధించింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మూడు పార్టీలుగా పోటీ చేసినప్పటికీ వైసీపీ అభ్యర్థులు మెరుగైన ఫలితాలు సాధించారు.మండలంలోని మొత్తం 20 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులకు 22,775 ఓట్లు లభించగా, కూటమి అభ్యర్థులకు కలిపి 19,924 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో కూటమి కంటే వైసీపీకి 2,831 ఓట్ల ఆధిక్యం లభించింది.

ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న జనసేన పార్టీ ఈ మండలంలో కేవలం ఆరు స్థానాల్లో మాత్రమే పోటీ చేసి, ఒక స్థానంలోనే విజయం సాధించింది. రఘుదేవపురం-2 ఎంపీటీసీ స్థానాన్ని మాత్రమే జనసేన దక్కించుకోగా, చిన్నకొండేపూడి-1, రాపాక, ఎనగంటివారిపేట, కూనవరం, మునికూడలి స్థానాల్లో ఓటమి చవిచూసింది.మరోవైపు టీడీపీ 13 స్థానాల్లో పోటీ చేసి ఏడు స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఓట్ల పరంగా వైసీపీ ఆధిక్యం స్పష్టంగా కనిపించింది. టీడీపీ పోటీ చేసిన 13 స్థానాల్లో ఆ పార్టీకి 13,340 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థులకు 14,365 ఓట్లు లభించాయి. అంటే టీడీపీ కంటే వైసీపీకి 1,025 ఓట్లు అధికంగా వచ్చాయి. జనసేన పోటీ చేసిన ఆరు స్థానాల్లో 5,845 ఓట్లు సాధించగా, అదే స్థానాల్లో వైసీపీ అభ్యర్థులకు 6,967 ఓట్లు లభించాయి. జనసేన కంటే వైసీపీకి 1,122 ఓట్ల ఆధిక్యం దక్కింది. ఒక స్థానంలో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థిపై వైసీపీ అభ్యర్థి 684 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

కోరుకొండలోనూ ఎంపీపీ పీఠం వైసీపీదే

కోరుకొండ మండలంలో మొత్తం 23 ఎంపీటీసీ స్థానాలకు గాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 12 స్థానాల్లో విజయం సాధించి ఎంపీపీ పీఠాన్ని దక్కించుకుంది. ఇక్కడ కూడా కూటమి అభ్యర్థులకు వైసీపీ గట్టి పోటీ ఇచ్చింది.బూరుగుపూడి నుంచి జనసేన ఎంపీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన వరద రాజరాజేశ్వరి రాణి ఓటమి పాలయ్యారు. వైసీపీ అభ్యర్థి పెన్నాడ సుమ 101 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వాలంటీర్‌గా పనిచేసిన సుమ విజయం స్థానికంగా ప్రాధాన్యత సంతరించుకుంది.మండలంలోని 23 ఎంపీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థులకు వైసీపీ అభ్యర్థుల కంటే 959 ఓట్లు తక్కువగా లభించినప్పటికీ, వైసీపీ అభ్యర్థులు బలమైన పోటీని కనబరిచారు. అయితే జడ్పీటీసీ స్థానాన్ని మాత్రం 602 ఓట్ల తేడాతో కోల్పోయారు.

వివాదాస్పదంగా మారిన కౌంటింగ్ ప్రక్రియ

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో పలు చోట్ల చోటుచేసుకున్న పరిణామాలు వివాదానికి దారితీశాయి. కోరుకొండ మండలం వెస్ట్ గోనగూడెంలో తొలుత వైసీపీ అభ్యర్థి ఏడు ఓట్లతో విజయం సాధించినట్లు ప్రకటించి, అనంతరం రీకౌంటింగ్ నిర్వహించి టీడీపీ అభ్యర్థి ఎనిమిది ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు వెల్లడించారు.సీతానగరం మండలం కాటవరంలోనూ ఇదే తరహా పరిణామం చోటుచేసుకుంది. తొలుత వైసీపీ అభ్యర్థి విజయం సాధించినట్లు ప్రకటించినప్పటికీ, రీకౌంటింగ్ అనంతరం టీడీపీ అభ్యర్థి 36 ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు ప్రకటించారు. రాజానగరం మండలం పల్లకడియంలోనూ రీకౌంటింగ్ అనంతరం టీడీపీ అభ్యర్థి విజయం సాధించినట్లు ప్రకటించారు.ముఖ్యంగా కోరుకొండ మండల జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ తీవ్ర వివాదాస్పదమైంది. తొలుత వైసీపీ అభ్యర్థి 1,150 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లు ప్రకటించగా, కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఫలితాల సరళి మారిపోయింది. అనంతరం టీడీపీ అభ్యర్థి 120 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లు చూపించి, చివరకు 604 ఓట్ల మెజారిటీతో విజయం సాధించినట్లు ప్రకటించారు.

ఈ పరిణామాలపై వైసీపీ అభ్యర్థి, కౌంటింగ్ ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. రీపోలింగ్ నిర్వహించాలని కోరినప్పటికీ అధికారులు అంగీకరించలేదని వైసీపీ నాయకులు ఆరోపించారు. రీకౌంటింగ్ కోసం నిర్ణీత 45 నిమిషాల గడువు ముగిసిందని అధికారులు చెప్పడంతో వివాదం మరింత ముదిరింది. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కౌంటింగ్ కేంద్రం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేసినప్పటికీ అధికారులు రీకౌంటింగ్‌కు అంగీకరించలేదు.

రాజానగరం మండలంలో మిశ్రమ ఫలితాలు

రాజానగరం మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొంత ప్రతికూల ఫలితాలు ఎదురయ్యాయి. మొత్తం 28 ఎంపీటీసీ స్థానాల్లో వైసీపీ ఆరు స్థానాలను మాత్రమే గెలుచుకుంది. టీడీపీ 10, జనసేన తొమ్మిది, బీజేపీ రెండు స్థానాల్లో విజయం సాధించగా, వసంత అభ్యర్థి ఒక స్థానాన్ని దక్కించుకున్నారు. నియోజకవర్గవ్యాప్తంగా ఏడు స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటముల మధ్య 50 ఓట్లలోపే తేడా ఉండటం ఎన్నికల పోటీ ఎంత హోరాహోరీగా సాగిందో తెలియజేస్తోంది.

ఎమ్మెల్యే స్వగ్రామం గాదరాడలోనూ వైసీపీ విజయం

జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ స్వగ్రామమైన గాదరాడలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక ఎంపీటీసీ స్థానాన్ని కైవసం చేసుకుంది. గ్రామంలో రెండు ఎంపీటీసీ స్థానాలు ఉండగా, జనసేన అభ్యర్థులను బరిలోకి దించలేదు. కూటమి తరఫున టీడీపీ అభ్యర్థులే పోటీ చేశారు.గాదరాడ-2 ఎంపీటీసీ స్థానంలో వైసీపీ అభ్యర్థి 131 ఓట్ల మెజారిటీతో విజయం సాధించగా, గాదరాడ-1 స్థానాన్ని టీడీపీ అభ్యర్థి గెలుచుకున్నారు. ఎమ్మెల్యే సొంత గ్రామంలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించడం రాజకీయంగా ఆసక్తికర పరిణామంగా మారింది.

సర్పంచ్ ఎన్నికలకు వ్యూహాత్మకంగా అడుగులు

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకుని రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రారంభిస్తోంది. ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు కావడంతో గ్రామాల వారీగా బలమైన అభ్యర్థులను ఎంపిక చేయడం, స్థానిక రాజకీయ పరిస్థితులను అంచనా వేయడం, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకోవడంపై పార్టీ దృష్టి సారిస్తోంది.మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మండలాల వారీగా నాయకులు, కార్యకర్తలతో సమీక్షలు నిర్వహిస్తూ పంచాయతీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. పరిషత్ ఎన్నికల్లో రెండు మండలాల్లో ఎంపీపీ పీఠాలను దక్కించుకోవడం, ఎమ్మెల్యే సతీమణిని జడ్పీటీసీ ఎన్నికల్లో ఓడించడం ద్వారా నియోజకవర్గంలో వైసీపీ తన ఉనికిని బలంగా చాటుకుంది.

రాష్ట్రవ్యాప్తంగా అధికార కూటమి అనుకూల ఫలితాలు సాధించిన పరిస్థితుల్లోనూ రాజానగరం నియోజకవర్గంలో వైసీపీ సాధించిన ఫలితాలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రానున్న పంచాయతీ ఎన్నికల్లోనూ ఇదే ఊపును కొనసాగించి గ్రామస్థాయిలో పార్టీ పట్టు పెంచుకునేందుకు జక్కంపూడి రాజా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు.