ఎంపీ పురందేశ్వరి ఆశీస్సులు తీసుకున్న రత్నం మహేశ్వరి దేవి
కూటమి నాయకులు, మిత్రబృంద సభ్యులతో కలిసి మర్యాదపూర్వక భేటీ
కడియం, మేజర్ న్యూస్ :రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరిని కడియం నూతన జడ్పీటీసీ సభ్యురాలు రత్నం మహేశ్వరి దేవి అయ్యప్ప మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ పురందేశ్వరి ఆశీస్సులు తీసుకుని, ఎన్నికల్లో తన విజయానికి సంబంధించిన విషయాలను ఆమెతో ఆత్మీయంగా పంచుకున్నారు. అలాగే కడియం మండలంలో రాజకీయ పరిస్థితులు, స్థానిక ప్రజల ఆకాంక్షలు, మండల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ఇరువురూ ఆప్యాయంగా ముచ్చటించారు.
ఇటీవల జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో 11,241 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించిన రత్నం మహేశ్వరి దేవి, ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మండల అభివృద్ధికి కృషి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో పార్టీ ముఖ్య నాయకులను, ప్రజాప్రతినిధులను మర్యాదపూర్వకంగా కలుస్తూ వారి ఆశీస్సులు, సలహాలు తీసుకుంటున్నారు.
ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరితో జరిగిన ఈ భేటీ ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగింది. ఈ కార్యక్రమంలో రత్నం మహేశ్వరి దేవి అయ్యప్ప మిత్రబృంద సభ్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.