గెలుపు ఓటమి సహజం
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంరాజకీయాల్లో గెలుపోటములు సహజమని, స్థానిక ఎన్నికల ఫలితాలను చూసి వైసీపీ శ్రేణులు ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాడాల విష్ణు చక్రవర్తి అన్నారు. వైసీపీకి 37 శాతం స్థిరమైన ఓటు బ్యాంకు ఉందని, తాజా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్టీ ఓటు బ్యాంకు ఆశాజనకంగా ఉందని పేర్కొన్నారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో కడియం మండలంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి 18 వేల మెజారిటీ రాగా, ప్రస్తుత స్థానిక ఎన్నికల్లో కూటమి ఆధిక్యం 11 వేల ఓట్లకు తగ్గిందని తెలిపారు. మండలంలోని 22 ఎంపీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు 27,120 ఓట్లు సాధించగా, వైసీపీ అభ్యర్థులు 15,770 ఓట్లు సాధించడం పార్టీకి ప్రజల్లో ఉన్న మద్దతుకు నిదర్శనమన్నారు. జడ్పీటీసీ అభ్యర్థి కొత్తపల్లి శివాజీకి 15 వేలకుపైగా ఓట్లు రావడం సాధారణ విషయం కాదన్నారు.
కడియపులంకలో తాను, తన సతీమణి తాడాల రాజరాజేశ్వరి ఓటమికి తమవైపు కొన్ని వైఫల్యాలు ఉన్నాయని అంగీకరించారు.అయితే ఎన్నికల్లో మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తమ ఓటమి కోసం ప్రత్యేకంగా ప్రయత్నించారని విమర్శించారు. కడియపులంకలో ఎన్నికల పోటీ ఆరోగ్యకరంగా సాగలేదని, స్థానిక సమస్యలను కూడా ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించారని తెలిపారు.తమకు ఓటు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన, విజయం సాధించిన దుళ్ల ఎంపీటీసీ ముసునూరి పద్మావతి, కడియం ఎంపీటీసీ శాఖా మరియమ్మకు అభినందనలు తెలిపారు. తన ఓటమిపై కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఓటమిని సంతోషంగా స్వీకరిస్తున్నానని చెప్పారు. ఇకపై పార్టీలో మరింత చురుకుగా పనిచేస్తానని, రాబోయే గ్రామపంచాయతీ ఎన్నికల్లో వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తాడాల విష్ణు చక్రవర్తి కోరారు.