ప్రజావాణి అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి
సూర్య - పెద్దపల్లి : ప్రజావాణికి వచ్చే దరఖాస్తులకు ప్రాధాన్యతనిస్తూ పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ బి. శ్రీరాములుతో కలిసి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.ఈ సందర్భంగా రామగుండం మండలం వీర్లపల్లిలో వర్షపు నీటి ప్రవాహానికి 40 ఏళ్ల క్రితం నిర్మించిన రెండు పైపుల స్థానంలో బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్థులు కోరారు. సుల్తానాబాద్ మండలం మద్దికుంటకు చెందిన రాధ తన భర్త కుటుంబ పోషణ పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేయగా, సంబంధిత తహసీల్దార్‌కు చర్యల కోసం ఆదేశించారు. వెన్నంపల్లికి చెందిన దివ్యాంగుడు తిరుపతి కొత్త ఆసరా పెన్షన్ మంజూరు చేయాలని కోరగా, పెద్దపల్లి మండలం చీకురాయికి చెందిన శారద ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. ఆయా అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు పంపించి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.