గ్రంధాలయ ఉద్యమ నాయకులకు ఘన నివాళులు
పాచిపెంట, సూర్య: మండల కేంద్రంలో స్థానిక గ్రంథాలయంలో 50వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వారోత్సవాలను ఈనెల 14వ తేదీ నుండి స్థానిక లైబ్రేరియన్ ఉదయ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ముందుగా గ్రంధాలయ ఉద్యమ నాయకులు చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. గ్రంధాలయ ఉద్యమ నాయకులను స్మరించుకోవడం చాలా గొప్ప విశేషమని తెలిపారు. ఉద్యమ నాయకులు అయినటువంటి అయ్యంకి వెంకటరమణయ్య, గాడిచర్ల సర్వోత్తమ రావు, పాతూరి నాగభూషణం, గురజాడ అప్పారావు ల యొక్క జీవిత చరిత్ర విశేషాలను విద్యార్థిని విద్యార్థులకు తెలియజేశారు. నిరక్షరాస్యత నిర్మూలన, మేధాశక్తి పెంపునుకు గ్రంధాలయాలు ఉపయోగపడతాయని అన్నారు. నేటి తరం విద్యార్థులు సెల్ఫోన్లకు దూరంగా ఉండి పుస్తక పఠనం వైపు మొగ్గు చూపాలని సూచించారు. సమాజ నిర్మాణంలో గ్రంధాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సమత పబ్లిక్ స్కూల్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.