మధుమేహం నివారిద్దాం - ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుదాం
పాలకొండ, సూర్య: ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఏపీ వాలంటరీ హెల్త్ అసోసియేషన్ - గుంటూరు వారి సౌజన్యంతో, పాలకొండ జన చేతన సంస్థ ఆధ్వర్యంలో పాలకొండ మండలం అన్నవరం, గొట్టమంగలాపురం గ్రామాలలో ఉపాధి హామీ వేతన దారులకు మధుమేహం పై అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముందుగా "మధుమేహాన్ని నివారిద్దాం – ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుదాం", "షుగర్ వ్యాధిని నిర్లక్ష్యం చేయొద్దు - ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయొద్దు","రోజూ నడక అలవాటు చేసుకోండి – మధుమేహాన్ని అదుపులో పెట్టుకోండి","తీపిని తగ్గించండి – ఆరోగ్యాన్ని పెంచుకోండి","సరైన ఆహారం – క్రమమైన వ్యాయామం – మధుమేహానికి దూరం"ముందస్తు పరీక్షలు చేయించుకోండి – మధుమేహ ప్రమాదాన్నితగ్గించుకోండి."ఆరోగ్యమే మహాభాగ్యం – మధుమేహ నియంత్రణే మన లక్ష్యం" నినాదాలు చేస్తూ చైతన్య పరచడం జరిగింది. అనంతరం జన చేతన కోఆర్డినేటర్ మామిడి సరస్వతి మాట్లాడుతూ ప్రజలు మధుమేహ వ్యాధిపై అవగాహన పెంపొందించుకోవాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. ప్రస్తుత కాలంలో మధుమేహ వ్యాధి వేగంగా విస్తరిస్తోందని, చిన్న వయస్సు వారిలో కూడా ఈ వ్యాధి కనిపిస్తోందని తెలిపారు. ఆహారపు అలవాట్లలో మార్పులు, శారీరక శ్రమ తగ్గడం, అధిక బరువు వంటి కారణాలు మధుమేహానికి దారితీస్తున్నాయని పేర్కొన్నారు.ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ వ్యాయామం చేయడం, పోషకాహారం తీసుకోవడం, చక్కెర పదార్థాలను తగ్గించడం, క్రమం తప్పకుండా రక్తంలో చక్కెర స్థాయిలను పరీక్షించుకోవడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చని తెలిపారు. కంచరాపు నాగమణి మాట్లాడుతూ మధుమేహం ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మందులు వాడుతూ, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.మధుమేహ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమం లో ఆయా గ్రామాల ఉపాధి హామీ వేతనదారులు, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.