చిత్రగుప్త యాప్‌పై అధికారులకు శిక్షణ.. వారం రోజుల్లో క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలి.. నవంబర్ 22లోగా వివరాల నమోదు చేయాలి
(అనంతపురం కార్పొరేషన్ మేజర్ న్యూస్..)
అనంతపురం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్‌లో చిత్రగుప్త యాప్ వినియోగంపై అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి అసిస్టెంట్ కలెక్టర్ సుయుష్ కుమార్ హాజరయ్యారు.ఈ శిక్షణ కార్యక్రమంలో రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, పబ్లిక్ హెల్త్ విభాగాల అధికారులు, అడ్మిన్, ప్లానింగ్, ఆమెనిటీస్, శానిటేషన్ కార్యదర్శులకు యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు.పైలట్ ప్రాజెక్టుగా నగరంలోని ఆదిమూర్తి నగర్, కమలా నగర్, రామచంద్ర నగర్, సాయి నగర్, జీరో క్రాస్, టవర్ క్లాక్, ఉమా నగర్ ప్రాంతాలను ఎంపిక చేశారు. ఈ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో సేకరించిన వివరాలను సంబంధిత రెవెన్యూ, ప్లానింగ్, ఇంజనీరింగ్, పబ్లిక్ హెల్త్ అధికారుల లాగిన్‌లకు అనుసంధానం చేశారు. ఆయా అధికారులు వారం రోజుల్లో క్షేత్రస్థాయిలో పరిశీలన పూర్తి చేసి, నవంబర్ 22, 2026లోగా యాప్‌లో పూర్తి వివరాలను నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.చిత్రగుప్త యాప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో పనిచేస్తుందని బెంగళూరుకు చెందిన యాప్ సంస్థ ప్రతినిధులు వివరించారు. ఈ యాప్ ద్వారా ఇంటి పన్ను పరిధిలోకి రాని నిర్మాణాలను గుర్తించడం, వీధి దీపాల మరమ్మతులు, రోడ్ల మరమ్మతుల అవసరాలను గుర్తించడం సాధ్యమవుతుందని తెలిపారు. తద్వారా నగరపాలక సంస్థ ఆదాయాన్ని పెంపొందించడంతో పాటు పౌరులకు మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని వివరించారు.
శిక్షణకు హాజరైన అధికారులు, సిబ్బంది యాప్‌పై పూర్తి అవగాహన పెంచుకుని, కలెక్టర్ నిర్దేశించిన గడువులోగా క్షేత్రస్థాయి పర్యటనలు పూర్తి చేసి వివరాలను నమోదు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ జస్వంత్ రావు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఎస్‌ఈ ఎఫ్‌ఏసీ షాకీర్ హుస్సేన్, టీపీఓ ఓంకార్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు సత్యనారాయణ, దాక్షాయణి, రెవెన్యూ అధికారులు లక్ష్మీదేవి, సుజాత, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, పైలట్ ప్రాజెక్టుకు సంబంధించిన స్వర్ణ వార్డు కార్యదర్శులు పాల్గొన్నారు.