ప్రభుత్వ ఆసుపత్రిలోనే అన్ని వైద్య పరీక్షలు
సూర్య - గోదావరిఖని: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రజలకు అవసరమైన అన్ని రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం రామగుండంలోని సింగరేణి వైద్య కళాశాలలో నిర్వహించిన అభివృద్ధి కమిటీ సమావేశంలో అదనపు కలెక్టర్ జె. అరుణశ్రీతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఏ ఒక్క వైద్య పరీక్ష కోసం కూడా రోగులను బయటకు పంపకుండా అవసరమైన వైద్య పరికరాలను ఆసుపత్రిలోనే ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందుకు అవసరమైన పరికరాల వివరాలు, అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఆసుపత్రి అభివృద్ధి నిధులను పారదర్శకంగా వినియోగించాలని, నూతన ఆసుపత్రి భవన నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలో క్రిటికల్ కేర్ బ్లాక్ వరకు నిర్మిస్తున్న రహదారి పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో రామగుండం మేయర్ మహంకాళి స్వామి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హిమబిందు సింగ్, వైద్యులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.