కె.వి.ఆర్. ఇంటర్మీడియట్ కళాశాల గుర్తింపు రద్దు చేయాలి సీపీఐ, ఏఐఎస్ఎఫ్ నాయకుల డిమాండ్
వెల్దుర్తి, మేజర్ న్యూస్: వెల్దుర్తి మండలంలోని రామాలకోట రోడ్డు సమీపంలో కనీస మౌలిక వసతులు లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేటు కె.వి.ఆర్. ఇంటర్మీడియట్ కళాశాల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని సీపీఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులు టి. కృష్ణ, సుధీర్ నాయుడు డిమాండ్ చేశారు. కళాశాలలో చదువుతున్న విద్యార్థులపై బయటి వ్యక్తులు వచ్చి దాడులకు పాల్పడుతున్నా యాజమాన్యం, ప్రిన్సిపాల్ పట్టించుకోకపోవడం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులకు తగిన రక్షణ కల్పించడంలో నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న ప్రిన్సిపాల్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని కోరారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సంబంధిత విద్యాశాఖ అధికారులు తక్షణమే కళాశాలను తనిఖీ చేయాలని, నిబంధనల ప్రకారం విచారణ జరిపి కళాశాల గుర్తింపును రద్దు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.