telangana
పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర కీలకం: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
గాజులరామారం మేజర్ న్యూస్ గాజులరామారం డివిజన్ హెచ్ఏఎల్ కాలనీలోని రిచ్ మైండ్స్ ఎలిమెంటరీ స్కూల్‌లో కుత్బుల్లాపూర్ ముస్లిమ్స్ మేనేజ్‌మెంట్ స్కూల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం జాతీయ విద్యా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌తో పాటు మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మానూ) హైదరాబాద్‌కు చెందిన సీపీడీయూఎం డైరెక్టర్ గౌలాల్ మొహమ్మద్ సామి సిద్ధిఖీ ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఉత్తమ అధ్యాపకులను, 2026 పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించి బహుమతులు అందజేశారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు రూపకల్పనలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల పాత్ర కూడా ఎంతో కీలకమని ఆయన అన్నారు. పిల్లల చదువుపై తల్లిదండ్రులు నిరంతరం శ్రద్ధ చూపుతూ, వారికి కొంత సమయం కేటాయించి ప్రోత్సహిస్తే విద్యలో మరింత మెరుగైన ఫలితాలు సాధించి ఉన్నత స్థాయికి ఎదగగలరని పేర్కొన్నారు. విద్యార్థుల్లో విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు పెంపొందించేందుకు ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా సమాజ అభివృద్ధికి దోహదపడే ఉత్తమ పౌరులను తీర్చిదిద్దవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు అల్తాఫ్ హుస్సేన్, ప్రధాన కార్యదర్శి సయ్యద్ ముంతాజ్ అలీ, కోశాధికారి సయ్యద్ జాహెద్ అలీ, మహబూబ్ సాబ్, బిలాల్, ముబషీరుద్దీన్, బురాన్, అన్వర్ ఉద్దీన్, సామి, నౌమహ, రాష్ట్ర జేవీవీ నాయకులు ఆర్. వరప్రసాద్, శ్రీనివాస్ గౌడ్, రవి కుమార్, పాక్స్ డైరెక్టర్ పరుశ శ్రీనివాస్ యాదవ్, స్థానిక బీఆర్‌ఎస్ డివిజన్ అధ్యక్షుడు విజయ్ రాంరెడ్డి, నాయకులు కస్తూరి బాల్ రాజ్, అడ్వకేట్ కమలాకర్, నవాబ్ ఖాన్, తెలంగాణ సాయి తదితరులు పాల్గొన్నారు