పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యం
పటాన్చెరు;అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని ఇస్నాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ మోటే సుమలత శ్రీకాంత్ పేర్కొన్నారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పాశమైలారం వార్డు కార్యాలయంలో ఒంటరి మహిళలు, దివ్యాంగులకు ఇప్పటికే మంజూరైన పెన్షన్లకు సంబంధించిన ధృవీకరణ పత్రాలను ఆమె లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మోటే సుమలత శ్రీకాంత్ మాట్లాడుతూ పెన్షన్ పథకాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఒంటరి మహిళలు, దివ్యాంగులకు ఎంతో భరోసానిస్తాయని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన వారికి ఆర్థిక చేయూత లభిస్తుందని, వారి జీవనోపాధికి ఆసరాగా నిలుస్తాయని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా తనవంతు కృషి చేస్తానని,ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాశమైలారం మాజీ సర్పంచ్ మోటే కృష్ణ యాదవ్,19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి,గ్రామ పెద్దలు,స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.