పేదల సొంతింటి కలకు నిజరూపం
కృష్ణ సూర్య న్యూస్ :
మండలంలోని గుర్జాల్, హిందూపూర్ గ్రామాలలో శనివారం పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'ఇందిరమ్మ ఇళ్ల' పథకం కింద నిర్మించుకున్న నూతన గృహాల ప్రారంభోత్సవ (గృహప్రవేశం) కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.
ఈ వేడుకకు రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సతీమణి వాకిటి లలితమ్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గుర్జాల్, హిందూపూర్ గ్రామాలకు చెందిన లబ్ధిదారులు నిర్మించుకున్న నూతన గృహాలకు ఆమె స్వయంగా లబ్ధిదారులతో కలిసి రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశం చేయించారు. అనంతరం ఆడపడుచులకు సంప్రదాయబద్ధంగా చీర సారె అందజేసి, వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వాకిటి లలితమ్మ మాట్లాడుతూ.. నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని పేర్కొన్నారు. ఎలాంటి పక్షపాతం లేకుండా, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంత గూడు కల్పించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఆమె స్పష్టం చేశారు. గ్రామానికి విచ్చేసిన మంత్రి సతీమణి లలితమ్మను గుర్జాల్ గ్రామ సర్పంచ్ కమలమ్మ ,తనయులు రవి పాటీల్ ,సంతోష్ పాటిల్ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నర్సిములు, సూర్య రిపోర్టర్ కృష్ణ మండలం