ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో తక్కువ నీటితో సాగు చేసే పంటలపై రైతులకు అవగాహన
కౌడిపల్లి మేజర్ న్యూస్: ఎల్‌నినో ప్రభావం, భవిష్యత్తులో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని రైతులు తక్కువ నీటితో సాగు చేసే ప్రత్యామ్నాయ పంటలు, ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని ఏడీఏ పుణ్యవతి సూచించారు. నీటి వనరులను బట్టి పంటలను ఎంపిక చేసుకోవాలని, అధిక నీటి అవసరమయ్యే వరి సాగుకు బదులుగా కూరగాయలు, పప్పుధాన్యాలు, ఇతర ఆరుతడి పంటలను సాగు చేయడం ద్వారా నీటిని పొదుపు చేసుకోవడంతో పాటు మంచి ఆదాయం పొందవచ్చని తెలిపారు.ఈ సందర్భంగా శనివారం కౌడిపల్లి మండలం మహమ్మద్‌నగర్ గ్రామంలో రైతులు సాగు చేస్తున్న కూరగాయల పంటలను ఏడీఏ పుణ్యవతి, మండల వ్యవసాయ అధికారి స్వప్న, వ్యవసాయ విస్తరణ అధికారి నరేందర్ సందర్శించి పంటల పరిస్థితిని పరిశీలించారు. రైతులకు పంటల సాగు, నీటి యాజమాన్యం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ ప్రణాళిక రూపొందించుకోవడంపై పలు సూచనలు చేశారు. రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకుంటూ తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం సాధించేలా పంటల వైవిధ్యీకరణ చేపట్టాలని అధికారులు సూచించారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా సాగు విధానాల్లో మార్పులు చేసుకోవడం ద్వారా వ్యవసాయంలో నష్టాలను తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు.
రైతులను ఆరుతడి పంటల సాగు వైపు ప్రోత్సహించేందుకు జొన్న విత్తన రకం సీఎస్‌వీ 41ను కౌడిపల్లి వ్యవసాయ కార్యాలయంలో పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తక్కువ నీటి అవసరమయ్యే పంటల సాగుకు ముందుకు రావాలని సూచించారు.