ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా పోలీస్ శాఖ ముందస్తు భద్రతా చర్యలు చేపడుతున్నాం ఫ జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్
బాపట్ల, మేజర్‌న్యూస్ :
జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా పోలీస్ శాఖ తరఫున ముందస్తు భద్రతా చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు తెలిపారు. బాపట్ల జిల్లాలో త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ మరియు మున్సిపల్ ఎన్నికలను ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ముందస్తు చర్యలలో భాగంగా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని పోలీస్ అధికారులు తమ పరిధిలోని గ్రామాల్లో రాత్రి బస చేసి, స్థానిక ప్రజలతో నేరుగా మమేకమయ్యారు. గ్రామసభలు నిర్వహించి గ్రామాల్లో ఉన్న స్థానిక సమస్యలు, సున్నితమైన అంశాలపై ఆరా తీశారు. ప్రజలు ఎటువంటి భయాందోళనలకు గురికాకుండా, ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలీస్ శాఖ తీసుకుంటున్న భద్రతా చర్యలను ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ జిల్లాలో మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటు బాపట్ల మున్సిపాలిటీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ తరఫున పటిష్టమైన ముందస్తు భద్రతా చర్యలు చేపడుతున్నామన్నారు. ఇప్పటికే పర్చూరు, చీరాల, వేమూరు నియోజకవర్గాల్లోని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియతో పాటు, బాపట్ల మున్సిపాలిటీలో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించగలిగామన్నారు. మూడవదశ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా శనివారం నుంచి బాపట్ల, రేపల్లె నియోజకవర్గాలలోని గ్రామ పంచాయతీల పరిధిలలో అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ జరుగుతున్నందున నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
జిల్లాలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ఎన్నికల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగా ప్రజల్లో భరోసా నింపేందుకు సమస్యాత్మక గ్రామాల్లో పోలీస్ బలగాలతో కవాతులు నిర్వహించడం, ఎన్నికల నియమావళిపై అవగాహన కల్పిస్తూ గ్రామాలను సందర్శించడం, గ్రామ ప్రజలతో సమావేశాలు నిర్వహించి స్థానిక సమస్యలు, సున్నితమైన అంశాలపై ఆరా తీయడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరించేందుకు పల్లె నిద్ర కార్యక్రమంతో పాటు జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించినా, శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తించినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించడమే లక్ష్యంగా అన్ని ముందస్తు భద్రతా చర్యలు చేపడుతున్నామని ఎస్పీ గారు తెలిపారు.