నెల్లూరు జిల్లాలో విద్యుత్ రంగానికి మహర్దశ
నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్ : నెల్లూరు జిల్లాలో విద్యుత్ వినియోగదారులకు మరింత నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించాలనే లక్ష్యంతో సుమారు రూ.32 కోట్ల వ్యయంతో తొమ్మిది నూతన సబ్‌స్టేషన్ల నిర్మాణ పనులను విద్యుత్ శాఖ చేపట్టిందని ఆపరేషన్ సూపరింటెండింగ్ ఇంజనీర్ పి. సుధాకర్ తెలిపారు. శనివారం విద్యుత్ భవన్‌లో మాట్లాడుతూ జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున ఒకేసారి నూతన సబ్‌స్టేషన్ల నిర్మాణ పనులు చేపట్టడం విశేషమని, ప్రస్తుతం పలు ప్రాంతాల్లో పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు.
జిల్లాలో నిర్మించనున్న నూతన సబ్‌స్టేషన్లు
సిరిపురం – కావలి సెక్షన్
సాయిపేట – కొండాపురం సెక్షన్ పెరుమాళ్లపాడు – చేజర్ల సెక్షన్
మక్తాపురం – సంగం సెక్షన్
పుడిపర్తి – వెంకటాచలం సెక్షన్
కృష్ణపట్నం – ముత్తుకూరు సెక్షన్
బూదనం – చిల్లకూరు సెక్షన్
బల్లవోలు – చిల్లకూరు సెక్షన్
దాచూరు – కలువాయి సెక్షన్ అని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శివ శంకర్ లోతేటి ఆదేశాల మేరకు ఈ నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నట్లు ఎస్‌ఈ తెలిపారు. ప్రతి సబ్‌స్టేషన్ నిర్మాణ పనులను కన్స్ట్రక్షన్ విభాగం అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, నాణ్యమైన మెటీరియల్ వినియోగం, నిర్మాణ ప్రమాణాలు, పనుల పురోగతిని ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నారని పేర్కొన్నారు.
కన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పరంధామయ్య ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ప్రతి సబ్‌స్టేషన్ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారని, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను సైతం ఆయా ప్రాంతాలకు పంపించి పనుల నాణ్యతను పరిశీలిస్తున్నారని తెలిపారు. అత్యంత పారదర్శకంగా, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా నిర్మాణ పనులు చేపడుతున్నారని పేర్కొన్నారు.
ఈ నూతన సబ్‌స్టేషన్ల నిర్మాణం పూర్తయితే ఆయా ప్రాంతాల్లో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా మెరుగుపడటంతో పాటు లో వోల్టేజ్ సమస్యలు తగ్గి, విద్యుత్ అంతరాయాలను నివారించేందుకు దోహదపడుతుందని తెలిపారు. ప్రతి విద్యుత్ వినియోగదారుడికి నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా ఎస్పీడీసీఎల్ నిరంతరం కృషి చేస్తోందని సూపరింటెండింగ్ ఇంజనీర్ పి. సుధాకర్ వెల్లడించారు.