పనులు పూర్తయ్యాక బిల్లుల సంగతేంటి?.. పీఏసీ భేటీలో జగ్గారెడ్డి సూటి ప్రశ్న
హైదరాబాద్: గాంధీ భవన్‌లో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలో రూ. 13 వేల కోట్లతో చేపట్టబోయే సాగునీటి, చెరువుల మరమ్మతు పనులపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇచ్చిన ప్రజెంటేషన్‌పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టత కోరారు. పనులు పూర్తి చేసిన తర్వాత బిల్లుల చెల్లింపు పరిస్థితి ఏంటని ఆయన సూటిగా ప్రశ్నించారు. చేసిన పనులకు సకాలంలో బిల్లులు రాకపోతే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని, ముఖ్యంగా ఎన్నికల ముందు బిల్లులు నిలిచిపోతే క్షేత్రస్థాయిలో కష్టమవుతుందని జగ్గారెడ్డి తన ఆందోళన వ్యక్తం చేశారు.
మరోవైపు, పీఏసీ సమావేశం నిర్వహిస్తున్న తీరుపై పార్టీ సీనియర్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. కీలక అంశాలపై చర్చించేందుకు పీఏసీ సమావేశాన్ని తప్పనిసరిగా నెలకు ఒకసారి నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే, పీఏసీ మరియు అడ్వైజరీ కమిటీ సమావేశాలను విడివిడిగా కాకుండా కలిపి ఎందుకు నిర్వహిస్తున్నారంటూ సీనియర్ నేతలు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.