దేవంపల్లి గ్రామ పాలచెరువుకు జలకళ.. ముందస్తు చర్యలతో రైతులకు భరోసా!
సూర్య - మానకొండూర్ : రానున్న రోజుల్లో 'ఎల్ నినో' ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉన్నందున, ముందస్తు జాగ్రత్తగా సాగు, తాగునీటి ఎద్దడిని నివారించేందుకు దేవంపల్లి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో వినూత్న చర్యలు చేపట్టారు. మండలంలోని దేవంపల్లి గ్రామంలో ‘వీబీజీ రామ్ జీ’ పథకం కింద డి.బి.ఎం-6 కాలువ నుండి గ్రామంలోని పాలచెరువు వరకు ఉపాధి హామీ కూలీలతో కాలువ పనులను ఆదివారం నిర్వహించారు. దీని ద్వారా డ్యామ్ నుండి వృథాగా పోతున్న జాలు నీటిని (సీపేజీ వాటర్) పాలచెరువులోకి మళ్లించారు.ఈ సందర్భంగా పనులను పర్యవేక్షించిన సర్పంచ్ బండారిపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. "ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించారని. భవిష్యత్తులో వర్షాభావ పరిస్థితులు తలెత్తితే గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటి, రైతులు, ప్రజలు ఇబ్బంది పడే ప్రమాదం ఉందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, ముందుచూపుతో డ్యామ్ నుండి వచ్చే జాలు నీటిని ఒడిసిపట్టి పాలచెరువుకు మళ్లించేందుకు ఈ కాలువ పనులను చేపట్టాం" అని తెలిపారు."వీబీజీ రామ్ జీ పథకంలో భాగంగా ఉపాధి హామీ కూలీల సహకారంతో డి.బి.ఎం-6 కాలువ నుండి పాలచెరువు వరకు కాలువను బాగు చేయించాంన్నారు. దీనివల్ల కూలీలకు ఉపాధి దొరకడంతో పాటు, పాలచెరువులోకి నీరు చేరి గ్రామంలోని పంట పొలాలకు, పశువులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దాడి కార్తిక్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి సుష్మ, టెక్నికల్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఫీల్డ్ అసిస్టెంట్ భాగ్యలక్ష్మి, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు..