మహిళా హత్య కేసును 24 గంటల్లోనే.. ఛేదించిన చేవెళ్ల పోలీసులు, నిందితుడి అరెస్ట్
రంగారెడ్డి: పోలీసులకు ఫిర్యాదు చేసిందన్న కక్షతో ఓ మహిళను కత్తితో దారుణంగా హత్య చేసిన ఘటనలో నిందితుడిని చేవెళ్ల పోలీసులు 24 గంటల్లోనే అరెస్ట్ చేశారు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి నిందితుడి నుంచి చోరీ చేసిన సెల్‌ఫోన్‌తో పాటు హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా వెలుగోడు మండలం జమ్మినగర్‌కు చెందిన కేతావత్ శివశంకర్ వరప్రసాద్ నాయక్ అలియాస్ శివ (19) నవంబర్ 20న బత్తుల గురువులకు చెందిన సెల్‌ఫోన్‌ను చోరీ చేశాడు. అనంతరం ఆ ఫోన్ ద్వారా ఆయన బ్యాంకు ఖాతా నుంచి రూ.45 వేల నగదును మరో ఖాతాకు బదిలీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో శివపై అనుమానం రావడంతో గురువులు, బత్తుల పద్మ కలిసి నవంబర్ 21న చేవెళ్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
తనపై పోలీసులకు ఫిర్యాదు చేశారన్న కోపంతో శివ కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఫరా కాలేజీ ఎదురుగా ఉన్న రేకుల ఇంటి సమీపంలో బత్తుల పద్మపై కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన చేవెళ్ల పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. వేగంగా దర్యాప్తు చేపట్టి కేవలం 24 గంటల్లోనే నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి చోరీ చేసిన సెల్‌ఫోన్, హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు.
కాగా, నిందితుడు శివకు ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా వెలుగోడు పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో నమోదైన మరో రెండు దొంగతనం కేసులతోనూ సంబంధం ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఈ సందర్భంగా చేవెళ్ల పోలీస్ ఇన్‌స్పెక్టర్ కె. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. మహిళ హత్య కేసును 24 గంటల్లోనే ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేయడంలో సమర్థవంతంగా పనిచేసిన ఎస్సై వెంకటేష్‌తో పాటు పోలీసు బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.
వి. శ్రీనివాస చారి: రంగారెడ్డి -మేజర్ న్యూస్