గట్టుదుద్దెనపల్లి సొసైటీలో రూ.లక్షలు హాంఫట్..? - పైపు లీకేజీ పేరిట బంకులో రూ.52 లక్షలు స్వాహా?
సూర్య - మానకొండూర్: రైతుల నమ్మకంతో నడుస్తున్న కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం గట్టుదుద్దెనపల్లి సహకార సంఘం (సొసైటీ)లో భారీగా నిధుల గోల్‌మాల్ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న డీజిల్, పెట్రోల్ బంకులో పనిచేస్తున్న ఉద్యోగి సుమారు రూ.52 లక్షలు స్వాహా చేసినట్లు రైతులు ఆరోపిస్తున్నారు.స్టాక్ షార్టేజీ రావడంతో ఈ వ్యవహారం బయటపడినట్లు తెలుస్తోంది. దీనికి తోడు సొసైటీలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ సుమారు రూ.4 లక్షలు కాజేసినట్లు, సీడ్ వ్యాపారం, గన్నీ బ్యాగుల వ్యవహారంలో సీఈఓ సుమారు రూ.40 లక్షల వరకు అవకతవకలకు పాల్పడినట్లు రైతులు ఆరోపణలు చేస్తున్నారు. రోజువారీ అమ్మకాలు, స్టాక్, కలెక్షన్ లెక్కల్లో భారీగా తేడాలు వస్తున్నా బాధ్యులు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నిస్తున్నారు.ఈ అవినీతి వెనుక ఒక్క ఉద్యోగి కాకుండా ఇతరుల హస్తం కూడా ఉండే అవకాశం ఉందని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.కేవలం అంతర్గత విచారణతో సరిపెట్టకుండా సహకార శాఖ ఉన్నతాధికారులు, ఆడిట్ శాఖ ఆధ్వర్యంలో పూర్తి స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. రిజిస్టర్లు, బ్యాంక్ లావాదేవీలు, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.ఈ విషయంపై సొసైటీ చైర్మన్ రాంరెడ్డిని వివరణ కోరగా..విచారణ నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. సీఈఓ తిరుపతి వివరణ కోరగా.. బంకులో ఎలాంటి గోల్‌మాల్ జరగలేదని, పైపు లీకేజీ వల్లనే సుమారు రూ.38 లక్షల విలువైన పెట్రోల్ వృథా అయ్యిందని చెప్పారు.బంకు ఉద్యోగిని వేరే సెక్షన్‌కు ఎందుకు బదిలీ చేశారన్న ప్రశ్నకు సీఈఓ సరైన సమాధానం దాటవేశారు. పైపు లీకేజీ జరిగితే రూ.38 లక్షల షార్టేజీ ఎలా వచ్చింది? ఆడిట్ నివేదికలోని రూ.62 లక్షలకు, సీఈఓ చెబుతున్న లెక్కలకు మధ్య ఉన్న తేడా ఏంటి? అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. జిల్లా సహకార అధికారులు స్పందించి ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చాలని రైతులు కోరుతున్నారు.