పాండురంగ నగర్ కాలనీలో ఘనంగా ఉచిత కంటి వైద్య శిబిరం
జూబ్లిహిల్స్, మేజర్ న్యూస్: నగరంలోని పాండురంగ నగర్ కాలనీ కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో లైన్స్ క్లబ్ హైదరాబాద్ బంజారాహిల్స్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం అత్యంత ఘనంగా నిర్వహించబడింది. కాలనీ వాసులకు, నిరుపేదలకు నాణ్యమైన కంటి వైద్య సేవలను అందించే లక్ష్యంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి లైన్స్ క్లబ్ సనత్‌నగర్ గ్లోబల్ మెంబర్‌షిప్ టీమ్ చైర్మన్ లయన్ ప్రఫుల్ల రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మానవ శరీరంలో కంటి చూపు అనేది భగవంతుడు ప్రసాదించిన అత్యంత ప్రాధాన్యత కలిగిన గొప్ప వరమని, ప్రతి ఒక్కరూ కంటి ఆరోగ్యంపై శ్రద్ధ వహించి జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. సమాజంలో చూపు మందగించి ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు ఉచితంగా కంటి ఆపరేషన్లు అందిస్తున్న సాధురామ్ ఐ హాస్పిటల్ యాజమాన్యాన్ని, వైద్య సిబ్బందిని ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.
పెద్ద సంఖ్యలో పాల్గొన్న కాలనీవాసులు
ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో లైన్స్ క్లబ్ ప్రతినిధులు లయన్ ఎల్.వి.ఎస్. నాయుడు, లయన్ డి.వి.ఎల్. శ్రీనివాస రాజు, కాలనీ కమిటీ సభ్యులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శిబిరంలో నిపుణులైన వైద్యులు కాలనీవాసులకు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి తగిన ఉచిత సలహాలు, మందులు అందజేశారు.