పకడ్బందీగా భూముల రీ సర్వే.. -కలెక్టర్ హైమావతి -వీరపూర్ లో భూ రీ సర్వే పరిశీలించి కలెక్టర్
బెజ్జంకి : ప్రభుత్వం చేపట్టిన భూముల రీ సర్వేను మార్గదర్శకాలకు అనుగుణంగా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు.మండలంలోని వీరాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న భూభారతి రీ సర్వే ప్రక్రియను మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూముల సర్వే చాలా కాలం నుంచి పెద్ద సమస్యగా మారిందని గ్రహించిన ప్రభుత్వం భూ రీ సర్వేను చేస్తున్నట్లు తెలిపారు.జనాభా పెరగడంతో భూ కమాతాలు చిన్నగా మారి సమస్యలు పెరిగాయని దీనికి శాశ్వత పరిష్కారం అందించడం కోసమే ప్రభుత్వం భూ రీ సర్వేను చేపడుతున్నట్లు వెల్లడించారు.గ్రామ విస్తీర్ణం ఎంత?ఇప్పటివరకు ఇంత సర్వే నిర్వహించారు.అనే విషయాలపై సర్వే చేస్తున్న అధికారులను అడిగి తెలుసుకున్నారు.అదే విధంగా రోజు 35 నుంచి 40 ఎకరాలకు పైగా సర్వే చేయాలని,సర్వే ప్రక్రియను పారదర్శకంగా,కచ్చితత్వంతో ఎలాంటి పొరపాట్లు లేకుండా నిర్వహించాలని సర్వే సిబ్బందిని ఆదేశించారు.సర్వే చేసిన ప్రతి అంశం రికార్డులలో నమోదు చేసి రైతులకు తెలపాలని భూ యజమానులకు సందేహాలు ఉంటే నివృత్తి చేయాలని కలెక్టర్ హైమావతి సూచించారు.అలాగే భూ రీ సర్వేకు రైతులు అధికారులకు సహకరించాలని కలెక్టర్ కోరారు.అంతకు ముందు మండల కేంద్రంలోని ప్రభుత్వోన్నత పాఠశాలను కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.విద్యార్థులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు.గదులు,పరిసరాలు,వంటగది ఇతర సౌకర్యాలను పరిశీలించారు.భోజన నాణ్యత,వంటలకు ఉపయోగిస్తున్న పదార్థాలు,పరిశుభ్రత తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు.మెనూ ప్రకారం నాణ్యమైన,పౌష్టికాహారం అందించాలని సిబ్బందిని ఆదేశించారు.పాఠశాల వెనకాల పిచ్చి మొక్కలు,చెత్తను గ్రామపంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందితో తొలగించేలా చర్యలు చేపట్టాలని సర్పంచ్ బొల్లం శ్రీధర్ కు సూచించారు.పాఠశాల ఆవరణాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్నారు.మెనూ ప్రకారం భోజనం అందించాలని విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించమని సిబ్బందిని,ఉపాధ్యాయులను కలెక్టర్ హెచ్చరించారు.తహసిల్దార్ శ్రీకాంత్,భూ రీ సర్వే సిబ్బంది,జీపిఓ రజిత,రైతులు,సర్పంచ్ బొల్లం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.