తెలంగాణను తాకనున్న ‘మురసు’ తుఫాన్: పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
సూర్య, హైదరాబాద్ :బంగాళాఖాతంలో ఏర్పడిన 'మురసు' తుఫాన్ తీవ్ర రూపం దాల్చి తెలంగాణ వైపు పయనిస్తోంది. అర్ధరాత్రి వేళ ఈ తుఫాన్ రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉండటంతో వాతావరణ కేంద్రం మరియు విపత్తు నిర్వహణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేశాయి. తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు.
పరిస్థితి తీవ్రతను బట్టి వాతావరణ శాఖ జిల్లాల వారీగా అలర్టులను ప్రకటించింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే మహబూబాబాద్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించగా.. ములుగు, హన్మకొండ, వరంగల్, యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ అమలు చేస్తున్నారు.
మరోవైపు రాజధాని హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా ఆకాశం పూర్తి మేఘావృతమై ఉండి, పలుచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అర్ధరాత్రి తుఫాన్ తెలంగాణ సరిహద్దులను తాకనున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ముందస్తు రక్షణ చర్యలు చేపట్టింది. అత్యవసర సహాయక చర్యల కోసం విపత్తు నిర్వహణ బృందాలను సిద్ధంగా ఉంచారు. రాత్రి సమయంలో ప్రజలు అనవసరంగా బయటకు రావద్దని, పిడుగులు మరియు ఈదురుగాలుల ప్రమాదం ఉన్నందున చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడవద్దని అధికారులు సూచించారు. కోతకొచ్చిన పంటలు, ఆరుబయట ఉన్న ధాన్యం రాశులు తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.