పట్టభద్రుల ఓటరు నమోదుపై బీఆర్ఎస్ దృష్టి
అర్హులైన ప్రతి ఒక్కరూ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు కావాలి.. మూడు రోజుల పాటు ప్రత్యేక నమోదు కేంద్రం ఏర్పాటు: పట్నం అవినాష్ రెడ్డి
షాబాద్, మేజర్ న్యూస్ (నవంబర్ 03):
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని మాజీ జడ్పీటీసీ, బీఆర్ఎస్ నాయకుడు పట్నం అవినాష్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అర్హత కలిగిన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు చేసుకునేలా నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. మంగళవారం షాబాద్ మండల కేంద్రంలో పట్నం అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. చేవెళ్ల నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జి రాంబాబు యాదవ్‌తో కలిసి ఆయన సమావేశానికి హాజరై ఓటరు నమోదు ప్రక్రియపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. నవంబర్ 6వ తేదీలోగా అర్హులైన పట్టభద్రులను గుర్తించి, వారందరినీ ఓటర్లుగా నమోదు చేయించాలని సూచించారు. ఓటరు నమోదుకు సంబంధించి తన కార్యాలయంలో మూడు రోజుల పాటు ప్రత్యేక నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు అవినాష్ రెడ్డి వెల్లడించారు. అర్హత కలిగిన పట్టభద్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామాల వారీగా పట్టభద్రులను గుర్తించి, నమోదు ప్రక్రియ పూర్తయ్యేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం 'గిఫ్ట్ ఏ స్మైల్' కార్యక్రమంలో భాగంగా ఆయా గ్రామాలకు చెందిన యువతకు క్రికెట్ కిట్లను అందజేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు నర్సింగరావు, శ్రీరాంరెడ్డి, నాయకులు మధుసూదన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, చాంద్ పాషా, ఆయా గ్రామాల సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.