పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం-పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
పరకాల, మేజర్ న్యూస్, పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. మంగళవారం పరకాల పట్టణ కేంద్రంలోని నూతన ప్రభుత్వ ఆసుపత్రిని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సందర్శించి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్య సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్య అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం రోజురోజుకూ పెరుగుతోందని, అందుకు అనుగుణంగా ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోందని అన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల పాటు వైద్య సేవలు అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. అన్ని ప్రధాన వైద్య విభాగాలకు సంబంధించి ప్రత్యేక వైద్య నిపుణులు అందుబాటులో ఉన్నారని, ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి అధిక వైద్య ఖర్చులు భరించలేక అప్పులపాలు కావద్దని, అవసరమైన వైద్య సేవలను ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే పొందాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండాలన్నదే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో పరకాల మున్సిపల్ చైర్ పర్సన్ పావుశెట్టి సునీల్ కుమార్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్: సుజాత, పరకాల, హనుమకొండ జిల్లా