గ్రామ పంచాయతీ కీ సర్పంచ్ ప్రథమ పౌరుడు
*సమస్యలురాజకీయాలకతీతంగా పరిష్కరించాలి *ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ, మేజర్ న్యూస్: గ్రామ పంచాయతీ సర్పంచ్ గ్రామ ప్రథమ పౌరుడని, గ్రామంలో ఉన్న సమస్యల ను గ్రామస్తులు సర్పంచ్ వద్దకు తీసుకెళ్తే రాజకీయా లకతీతంగా సర్పంచ్‌లు సంబంధిత మండల అధికారులను సంప్రదించి వెంటనే స్పందించి ఆ సమస్యనుపరిష్కరించాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కోరారు.మంగళవారం మిర్యాలగూడ మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎల్ నినో, భారీ వర్షాలతో రైతులకు జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేయాలని, దానికనుగుణంగా ప్రభుత్వం నుంచి సహాయం కోసం కృషి చేస్తానన్నారు. మండల అభివృద్ధికి, గ్రామాల అభివృద్ధికి ఏమవసరమో అంచనా వేయాలని కోరారు.
మండల వ్యవసాయ శాఖ అధికారి ఎం.రుషేంద్రమణి మాట్లాడుతూ వచ్చే రబీ సీజన్‌లో వరి పంటలు వేయకుండా ఆరుతడి పంటలు అనగా మినుము, పెసర వంటి పంటలు వేయాలని, ఈ పంటలకు ప్రభుత్వ సబ్సిడీ కూడా కలదన్నారు.
మండల విద్యాధికారి డి.ధర్మనాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నీరు నిలవకుండా చూసుకోవాలని, పాఠశాల భవనాలు కూలే స్థితిలో ఉంటే వీబీజీరామ్‌జీ నిధులలో నిర్మించుకోవచ్చన్నారు.
మండల తహసీల్దార్ జె.శ్రీనివాస్ మాట్లాడుతూ కొత్త రేషన్ కార్డులు అనేవి నిరంతర ప్రక్రియ కావున దరఖాస్తుచేసుకోవచ్చన్నారు.మహిళా, శిశు సంక్షేమ శాఖ సీడీపీఓ ఎం.వేణుగోపాల్‌రావు మాట్లాడుతూ మిర్యాలగూడ మండల పరిధిలోని గ్రామాలలో బాల్యవివాహాలు చాలా జరుగుతున్నాయని, ఇందుకు గ్రామ సర్పంచ్, కార్యదర్శి సహకారంతో బాల్యవివాహాలు అరికట్టవచ్చన్నారు.
మండల వైద్యశాఖ అధికారి డాక్టర్ స్వప్న మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాలల్లో 180 సాధారణ ప్రసవాలు చేశామన్నారు.
మండల పరిషత్తు అభివృద్ధి అధికారి ఎం.శేషగిరిశర్మ మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావం వల్ల తాగునీటికి, పశుగ్రాసం కొరత ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయని, వ్యవసాయ కూలీలు, వ్యవసాయదారులకు పనులు దొరికే పరిస్థితి లేదని అన్నారు. భూగర్భ జలాలు అభివృద్ధి చెందుటకు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుటకు ఇంకుడు గుంతలు లేని ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు తవ్వించాలని, లోతట్టు ప్రాంతాలలో నీరు నిలవకుండా, మురుగునీరు రోడ్లపై పారే చోట కమ్యూనిటీ సోక్ పిట్స్ తవ్వించాలని, బోర్‌వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్ నిర్మిస్తే ఎండిపోయిన బోరుబావుల్లో నీళ్లు సమృద్ధిగా వచ్చే అవకాశం ఉంటుందని సూచించారు.
ఆర్‌సీసీ ఇంటిపై కప్పు వర్షపు నీరు వృథాగా పోకుండా రూఫ్ టాప్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ నిర్మించాలని, రైతులకు ఫారం పాండ్స్ 20x20, 15x15, 12x12 మీటర్ల కొలతలతో రెండు మీటర్ల లోతుతో తవ్వించాలని, దానివల్ల రైతులకు లాభం చేకూరుతుందని, వేజ్ సీకర్లకు పని దినాలు పెరుగుతాయని తెలిపారు. గుట్టలకు కందకాలు తవ్వించాలని, పశువులకు తాగునీటి కొరకు నీటి తొట్లు నిర్మించాలని, పొలాలలో గడ్డి పెంచుటకు, చెరువులలో, కాలువలలో పూడిక తీయుటకు మొదలగు జలసిరి పనులు నిర్వహించి భూగర్భ జలాలనుపెంపొందించాలన్నారు.ప్రతి 30 లేదా 40 వేజ్ సీకర్లకు ఒక మేటును నియమించుకోవాలన్నారు. ప్రతి వేజ్ సీకర్ 7 నుంచి 8 గంటల పాటు పనిచేయాలని, రోజు కూలి రూ.308లు వచ్చే విధంగా కొలతలతో పని చేయించాలన్నారు. ఎస్‌బీఎం 70 శాతం, 30 శాతం గ్రామపంచాయతీ, 15 శాతం లేదా 16 శాతం ఫైనాన్స్ నిధులతో డ్రైన్ అండ్ సోక్ పిట్‌లు, అంగన్‌వాడీ భవనాలలో టాయిలెట్స్ నిర్మించాలన్నారు.