ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది
హిమాయత్ నగర్, మేజర్ న్యూస్ : ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, సర్ పేరిట 13 కోట్ల మంది ఓటర్లను తొలగించడం అమానుషమని పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. మంగళవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఓటర్స్ రైట్ ఫోరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో సీనియర్ జర్నలిస్ట్ ,సామాజికవేత్త డాక్టర్ పరకాల ప్రభాకర్ తో కలిసి హరగోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఓటర్లను తొలగించడమే పనిగా ముందుకు పోతుందని అన్నారు.
ఎలక్షన్ కమిషన్ ప్యానల్ లో చీఫ్ జస్టిస్ ని తీసివేయడం దురుద్దేశం గా కనిపిస్తుంది అన్నారు. ఎలక్షన్ కమిషన్ ప్రజల విన్నపాలను వినడం లేదన్నారు. అనంతరం పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా హోదాకు తగ్గట్లుగా మాట్లాడటం లేదన్నారు. ముషీరాబాద్ , కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో జరిపిన సర్ పరిశీలనలో తాను పాల్గొన్నానన్నారు.
తిరుమలగిరి బూత్ నెంబర్ 150, 151 లో జరిగిన పబ్లిక్ ఇయర్ రింగ్ లో తను పాల్గొన్నారు. అక్కడ 1800 మంది ఓటర్లు ఉంటే 721 మందిని తొలగించి 900 మందికి నోటీసులు పంపారని చెప్పారు. ఇందులో 290 మందిని మాత్రమే ఓటర్లుగా తేల్చారని సూచించారు. సర్ పేరిట తొలగింపు తప్ప దేశంలోని ఏ రాష్ట్రంలో ఓట్లు పెరగడం లేదన్నారు. అమిత్ షా ఆధారాల్లేకుండా మాట్లాడుతున్నారని చెప్పారు దేశంలో ఇంతవరకు సర్ జరగలేదని చెప్పారు. సర్ పేరిట బిజెపి దేశంలోని ప్రజలను రెండు జాతులుగా విభజించేందుకు ప్రయత్నం చేస్తుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సామాజికవేత్తలు డాక్టర్ సునీత, గణేష్, సిస్టర్ మంజుల ,పద్మజ, మసూద్ తదితరులు పాల్గొన్నారు.