17,415 ఎన్ హెచ్ఎం ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాల్సిందే!
22 రోజులుగా రోడ్డెక్కినా స్పందించరా?
ప్రభుత్వం దిగిరాకుంటే అసెంబ్లీ ముట్టడి తరహాలో భారీ ధర్నా: డాక్టర్ చినుకని శివప్రసాద్ హెచ్చరిక*
యాదాద్రి భువనగిరి ప్రతినిధి మేజర్ న్యూస్
ఏళ్ల తరబడి ప్రభుత్వ వైద్య సేవల్లో వెన్నెముకగా నిలుస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడాలని తెలంగాణ హోమియో డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చినుకని శివప్రసాద్ తీవ్రస్థాయిలో డిమాండ్ చేశారు. తమ న్యాయమైన హక్కుల సాధన కోసం ఎన్‌హెచ్‌ఎం జేఏసీ తెలంగాణ రాష్ట్రం ఆధ్వర్యంలో 22 రోజులుగా కొనసాగుతున్న నిరవధిక సమ్మెకు ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఎన్‌హెచ్‌ఎం పరిధిలో పనిచేస్తున్న 17,415 మంది ఉద్యోగుల సేవలను ప్రభుత్వం విస్మరించడం దుర్మార్గమన్నారు. ప్రజలకు వైద్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించకుండా, వారి న్యాయమైన డిమాండ్లను పట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేస్తున్న ఉద్యోగులకే భద్రత లేకపోతే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు ఎలా అందుతాయని నిలదీశారు.22 రోజులుగా ఉద్యోగులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఇకనైనా ప్రకటనలతో కాలయాపన చేయకుండా 17,415 మంది ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులందరినీ తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సహనాన్ని చేతగానితనంగా భావించవద్దని, వారి హక్కుల కోసం జరిగే పోరాటాన్ని తక్కువ అంచనా వేయవద్దని హెచ్చరించారు.ప్రభుత్వం తక్షణమే దిగిరాకపోతే ఇదే 17,415 మంది ఉద్యోగులతో అసెంబ్లీ ఎదుట భారీ ధర్నా చేపట్టి ప్రభుత్వానికి తమ నిరసన సెగ చూపిస్తాం. ఉద్యోగుల హక్కులు సాధించే వరకు పోరాటం ఆగదు. వారి న్యాయమైన డిమాండ్లకు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది అని డాక్టర్ చినుకని శివప్రసాద్ స్పష్టం చేశారు*