యానిమేషన్ రంగానికి ఉజ్వల భవిష్యత్తు
రవీంద్ర భారతి, మేజర్ న్యూస్ 3: యానిమేషన్ రంగంలో ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని, నేటికీ అపారమైన అవకాశాలు ఉన్నాయని అసోసియేషన్ ఇంటర్నేషనల్ డు ఫిలిం ది అనిమేషన్ సంస్థ జాతీయ ఉపాధ్యక్షుడు బుగ్గ వీటి రాజశేఖర్ తెలిపారు. రవీంద్ర భారతి లో యానిమేషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యానిమేషన్ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఎ ఐ) తో యానిమేషన్ రంగానికి వచ్చిన ముప్పు ఏం లేదన్నారు.
ఏఐ మనుషులను తగ్గించగలుగుతుందేమో కానీ మన ఆలోచనలను, క్రియేటివిటీని చేయలేదన్నారు. అసోసియేషన్ ఇండియా అధ్యక్షులు సంజయ్ ఖిమేసర మాట్లాడుతూ.. భారతీయ ప్రతిభను ప్రపంచ యానిమేషన్ సమాజంతో అనుసంధానించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం సృజనాత్మకత, నైపుణ్యం, సాంకేతికత, విభిన్నంగా కథ చెప్పడం, యానిమేషన్ రంగంలో మహిళల అవకాశాలు వంటి పలు అంశాలపై యానిమేషన్ నిపుణులు విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఇండియా ఉపాధ్యక్షురాలు వినీత బచాని, యానిమేషన్ నిపుణులు క్రాంతి శర్మ, జయంతి మహాపాత్ర, రూపాలి గట్టి, చిత్ర నిర్మాత సిద్ధార్థ మస్కేరి లతోపాటు వివిధ కళాశాలకు చెందిన 1200 మంది విద్యార్థులు పాల్గొన్నారు.