న్యూయార్క్‌లో టీటీఏ బోర్డ్ మీటింగ్
హిమాయత్ నగర్, మేజర్ న్యూస్ :తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) బోర్డ్ మీటింగ్ న్యూయార్క్‌లోని రాడిసన్ హోటల్‌లో జరిగింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, అడ్వైజరీ కౌన్సిల్ మరియు అమెరికా నలుమూలల నుండి వచ్చిన ప్రాంతీయ నాయకులతో సహా సుమారు 150 మంది ఈ సమావేశంలో పాల్గొన్నారు. 2025-2026లో సంస్థ సాధించిన విజయాలను సమీక్షించడంతో పాటు, తెలుగు కమ్యూనిటీకి నిరంతరం సేవలందించే ప్రాధాన్యతలపై వారు చర్చించారు.
చార్లెట్ కన్వెన్షన్‌ను అద్భుతంగా విజయవంతం చేయడానికి అహర్నిశలు శ్రమించిన కన్వెన్షన్ బృందాన్ని, దేశవ్యాప్తంగా ఉన్న కమిటీ సభ్యులను డాక్టర్ మల్లారెడ్డి పైళ్ల అభినందించారు. కన్వెన్షన్ గ్రాండ్ సక్సెస్ కావడంలో విశేష కృషి చేసిన చైర్మన్ డాక్టర్ విజయపాల్ రెడ్డి, ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది, కన్వెన్షన్ కన్వీనర్ ప్రవీణ్ చింత, కోఆర్డినేటర్లు నరేన్ దేవరపల్లి, శేఖర్ రెడ్డి, అలాగే సహోదర్ పెద్దిరెడ్డి, శివ రెడ్డి, నరసింహ పెరుకలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.టీటీఏ ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది మాట్లాడుతూ.. సేవా డేస్, ఇండియాలో జరిగిన టీటీఏ 10వ వార్షికోత్సవ వేడుకలు, నార్త్ కరోలినాలోని చార్లెట్‌లో జరిగిన 2026 టీటీఏ కన్వెన్షన్ వంటి ముఖ్యమైన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన తీరును వివరించారు. ఈ విజయాలకు దోహదపడిన సమిష్టి కృషిని, కమ్యూనిటీ మద్దతును ఆయన గుర్తుచేసుకున్నారు. బోర్డ్ మీటింగ్ స్పాన్సర్‌లకు, డాక్టర్ మల్లారెడ్డి పైళ్లకు, టీటీఏ అడ్వైజరీ కమిటీకి, ప్రవీణ్ చింతకు వారి విలువైన మద్దతు, సహకారం అందించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సమావేశంలో 2026 కన్వెన్షన్ బడ్జెట్/ఖర్చులు, సభ్యత్వాలపై కూడా సమీక్షలు, చర్చలు జరిగాయి. అలాగే, 2027 జనవరి చివరి వారంలో నిర్వహించాలని భావిస్తున్న తదుపరి సమావేశ వివరాలను కూడా చర్చించారు. భవిష్యత్ ప్రణాళికలు, సంస్థాగత ప్రాధాన్యతలు, రాబోయే కార్యక్రమాలపై చర్చించేందుకు కొత్తగా ఏర్పడే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మరియు ఎగ్జిక్యూటివ్ బాడీతో ఈ తదుపరి సమావేశం జరగనుందని అంచనా.బోర్డ్ మీటింగ్ ఏర్పాట్లలో అంకితభావంతో పనిచేసి, దాన్ని గొప్ప సక్సెస్ చేసిన టీటీఏ న్యూయార్క్ బృందాన్ని అందరూ అభినందించారు.
అమెరికాలోని తెలుగు కమ్యూనిటీ ఎదుర్కొంటున్న సవాళ్లు, టీటీఏ అందించగల సేవలు, భవిష్యత్ సామాజిక కార్యక్రమాలపై నాయకత్వం చర్చించింది. 2025-2026 విజయాల స్ఫూర్తితో సమిష్టి నాయకత్వం ద్వారా టీటీఏ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లాలనే సరికొత్త ఉత్సాహంతో ఈ సమావేశం ముగిసింది.