గ్రాడ్యుయేట్ల ఓట్ల నమోదు పై దృష్టి పెట్టండి: డాక్టర్ రవి శేఖర్ రెడ్డి
వెంగళరావునగర్, మేజర్ న్యూస్:పట్టభద్రుల ఎమెల్సీ ఓటు నమోదుకు పొడగించిన గడువును గ్రాడ్యుయేట్స్ సద్వినియోగం చేసుకొని ఓటరుగా పేర్లు నమోదు చేసుకోవాలని ఏఐసీసీ జాతీయ కో ఆర్డినేటర్ డాక్టర్ పి.వి. రవి శేఖర్ రెడ్డి కోరారు. శుక్రవారం కళ్యాణ్ నగర్ వెంచర్ త్రీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓటునమోదు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ రవి శేఖర్ రెడ్డి అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగళ్ల నరసింహారావు, సభ్యులు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి ఓట్ల నమోదు పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఓటరు నమోదు కార్యక్రమంలో. క్షేత్ర స్థాయిలో పాల్గొని పురోగతిని పరిశీలించారు. 5వ తేదీ వరకు ఓటు నమోదు ఉన్న గడువును ఎన్నికల అధికారులు ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ వరకు పొడిగించారని చెప్పారు. గత ఎమ్మెల్సీ ఎన్నికలలో 11 వేల పై చిలుకు ఉన్న పట్టభద్రుల ఓట్ల సంఖ్యను గడువులోగా మరింత పెంచేవిధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు.
అర్హులైన పట్టభద్రులందరూ ఓటు నమోదు చేసుకునేలా చొరవ చూపాలని, సమస్యలు ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించాలన్నారు. ఓటరు నమోదుకు అర్హత ఉన్న ఏ పట్టభద్రుడు అవకాశం కోల్పోకుండా చూడాలన్నారు. విద్యావంతులు, మేధావులు, యువకులు కాంగ్రెస్ కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని, కాంగ్రెస్ అభ్యర్థి ఘన విజయం సాధించడం ఖాయమని తెలిపారు. ఈ సందర్భంగా పట్టభద్రులకు ఓటు నమోదు దరఖాస్తు ఫారాలను అందజేశారు.కార్యక్రమంలో కళ్యాణ్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు నాగళ్ల నరసింహారావు, సభ్యులు, కాంగ్రెస్ నాయకులు వినోద్ కుమార్, నాగరాజు, భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు