తుఫాను వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే నల్లమిల్లి.
అనపర్తి, మేజర్ న్యూస్:తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన వ్యవసాయ పంట పొలాలను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనపర్తి నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో ఆయన పర్యటించి వర్షాలు, వరద నీటి కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా పంట నష్టపోయిన రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.తుఫాన్ కారణంగా వరి పొలాలు నీట మునగడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ముఖ్యంగా కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటలు నీటిలో మునిగిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని అన్నారు.
ఇప్పటికే పెట్టుబడుల రూపంలో వేలాది రూపాయలు ఖర్చు చేసిన రైతులకు ప్రకృతి వైపరీత్యం రూపంలో మరోసారి ఇబ్బందులు ఎదురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.పంట నష్టంతో ఆందోళన చెందుతున్న రైతులకు ఆయన ధైర్యం చెప్పారు. రైతులు అధైర్యపడవద్దని, ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని భరోసా కల్పించారు. క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని పరిశీలించి, వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో పర్యటించినట్లు తెలిపారు. అధిక వర్షాలు, పొలాల్లో నిలిచిపోయిన వరద నీటి కారణంగా పంట దిగుబడి తగ్గడంతో పాటు ధాన్యం నాణ్యత దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
పంట నష్టంపై సమగ్ర అంచనాలు రూపొందించి బాధిత రైతులకు తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు నష్టపోకుండా అవసరమైన సహాయక చర్యలు చేపట్టడం, పంట నష్టాన్ని పారదర్శకంగా అంచనా వేయడం ముఖ్యమని ఎమ్మెల్యే అన్నారు. రైతులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం అందేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.