విశాఖ కోర్టు సంచలన తీర్పు
ఇన్‌స్టా కీచుకుడి కి మూడేళ్ళ జైలుశిక్ష..
చిన్నారుల అశ్లీల చిత్రాల కేసులో తీర్పు
విశాఖపట్నం:సూర్య
చిన్నారులకు సంబంధించిన అశ్లీల దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసిన వ్యక్తికి న్యాయస్థానం కఠిన శిక్ష విధించింది. చిన్నారుల జీవితాలతో ముడిపడిన ఇలాంటి తీవ్రమైన నేరాల పట్ల చట్టం కఠినంగా వ్యవహరిస్తుందని ఈ తీర్పు మరోసారి స్పష్టం చేసింది.తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో చిన్నారుల అశ్లీల దృశ్యాలను అప్లోడ్ చేసిన పెంటకోట హర్షవర్ధన్‌కు మూడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ విశాఖ ప్రధాన న్యాయమూర్తి ఎం. ప్రదీప్ కుమార్ నవంబర్ 3న తీర్పు వెలువరించారు.
ఈ కేసు అంతర్జాతీయ స్థాయిలో చిన్నారులపై జరుగుతున్న లైంగిక దోపిడీకి సంబంధించిన సమాచార సేకరణ వ్యవస్థ ద్వారా వెలుగులోకి వచ్చింది. సామాజిక మాధ్యమాల్లో చిన్నారులకు సంబంధించిన అసభ్యకర దృశ్యాలు ప్రచారమవుతున్నట్లు జాతీయ బాలల అదృశ్యం, దోపిడీ నిరోధక సంస్థ ద్వారా కేంద్ర హోంశాఖకు సమాచారం అందింది.అక్కడి నుంచి రాష్ట్ర నేర పరిశోధన విభాగం మీదుగా విశాఖ నగర పోలీసులకు వివరాలు చేరాయి.దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టి 2022 మార్చి 28న కేసు నమోదు చేశారు.సాంకేతిక ఆధారాలను విశ్లేషించి వీడియోలను అప్లోడ్ చేసిన వ్యక్తిని విశాఖ జిల్లాకు చెందిన పెంటకోట హర్షవర్ధన్‌గా గుర్తించారు.తన సెల్ఫోన్లో చిన్నారులకు సంబంధించిన అశ్లీల దృశ్యాలను దింపుకొని, తన సామాజిక మాధ్యమ ఖాతా ద్వారా ప్రచారం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.కేసు విచారణ సందర్భంగా పోలీసులు కీలక ఆధారాలను న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. వాటి ఆధారంగా నిందితుడిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధించారు.చిన్నారులకు సంబంధించిన అశ్లీల దృశ్యాలను సృష్టించడం, భద్రపరచడం,ఇతరులకు పంపించడం,
సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు.