మిసెస్ హైదరాబాద్ కిరీటం కైవసం చేసుకున్న పి.గన్నవరం యువతి రాజశ్రీ
ఫ్యాషన్ రంగంలో ప్రతిభ చాటిన కోనసీమ బిడ్డ.. గ్రామస్థుల హర్షం
పి గన్నవరం మేజర్ న్యూస్ :డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి.గన్నవరం గ్రామానికి చెందిన ముతాబత్తుల రాజశ్రీ ఫ్యాషన్ రంగంలో తన ప్రతిభను చాటుకున్నారు. వరంగల్‌లో తెలంగాణ ఫ్యాషన్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'తెలంగాణ స్పార్క్' పోటీల్లో పాల్గొని ప్రతిష్ఠాత్మకమైన మిసెస్ హైదరాబాద్ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు.
పి.గన్నవరం గ్రామంలోని నేలపూడివారిపేటకు చెందిన రాజశ్రీకి ఫ్యాషన్ రంగంపై ఉన్న ఆసక్తి ఆమెను ఈ పోటీల్లో పాల్గొనేలా చేసింది. మూడు విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో తన ప్రతిభను ప్రదర్శించి విజేతగా నిలిచారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆమెకు కిరీటాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు.
సొంత గ్రామానికి చెందిన యువతి హైదరాబాద్ స్థాయి టైటిల్‌ను సాధించడం పట్ల పి.గన్నవరం గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాజశ్రీ సాధించిన ఈ విజయంపై కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్థానికులు అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నారు.