నిరుద్యోగులపై బీఆర్ఎస్‌కు మొసలి కన్నీరుః టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని
సూర్య, తెలంగాణ, బ్యూరో ప్రతినిధిః కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై విమర్శలు చేసే నైతిక అర్హత బీఆర్ఎస్ నాయకులకు లేదని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ అన్నారు. నిరుద్యోగుల పేరుతో బీఆర్ఎస్ నాయకులు ఇంకా ఎన్నాళ్లు రాజకీయ పబ్బం గడుపుకుంటారని ప్రశ్నించారు. రాహుల్ గాంధీని అవమానించేలా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. తెలంగాణ యువత పట్ల రాహుల్ గాంధీకి ఎంతో ప్రేమ, అభిమానం ఉందని, యువతతో కలిసి భోజనం చేస్తూ వారి సమస్యలను తెలుసుకున్నారని తెలిపారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఎప్పుడైనా అశోక్‌నగర్‌కు వచ్చి నిరుద్యోగుల సమస్యలను తెలుసుకున్నారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో పదేళ్ల పాటు క్లబ్బులు, పబ్బుల సంస్కృతిని ప్రోత్సహించారని, టానిక్ లిక్కర్ షాపులను ఏర్పాటు చేశారని విమర్శించారు. ఆ పాలనలోనే గంజాయి, డ్రగ్స్ సంస్కృతి పెరగడానికి అవకాశాలు కల్పించారని ఆరోపించారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి గంజాయి, డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా ఉక్కుపాదం మోపుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రజా పాలనలో ఉద్యోగాల భర్తీతో పాటు విద్య, వైద్యం, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించి కార్యాచరణ అమలు చేస్తున్నామని తెలిపారు. రెండేళ్ల పాలనలోనే 25 వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించి అచ్చంపేట సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని స్వాగతించాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపై ఉందన్నారు.
ఎ.రవీందర్, హైదరాబాద్.