రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి *జిల్లా కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి*
కర్నూలు, నవంబర్ 28:- రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రెండవ విడత సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని ఆదోని, కర్నూలు డివిజన్ల పరిధిలో 9 మండలాల్లో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. మొత్తం 186 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ విడుదల చేయగా, 16 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయని, మిగిలిన 170 గ్రామ పంచాయతీలకు పోలింగ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అదే విధంగా మొత్తం 1,972 వార్డులకు నోటిఫికేషన్ జారీ చేయగా, 381 వార్డులు ఏకగ్రీవమయ్యాయని, ఎమ్మిగనూరు మండలంలో ఒక వార్డుకు నామినేషన్లు దాఖలు కాలేదని కలెక్టర్ వివరించారు. దీంతో 1,590 వార్డులకు పోలింగ్ జరగనుందన్నారు. రెండవ విడత ఎన్నికల కోసం మొత్తం 1,783 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.. ఈ ఎన్నికల్లో 2,16,191 మంది పురుషులు, 2,23,135 మంది మహిళలు, 55 మంది ఇతరులు కలిపి మొత్తం 4,39,381 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. 231 హైపర్ సెన్సిటివ్ & 127 సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నామని, మిగిలిన పోలింగ్ కేంద్రాల్లో వీడియోగ్రాఫర్ లను ఏర్పాటు చేయించడం జరిగిందన్నారు..
ఆదోని డివిజన్ పరిధిలోని గోనెగండ్ల, కోసిగి, కౌతాళం, మంత్రాలయం, నందవరం, పెద్దకడబూరు, ఎమ్మిగనూరు మండలాల్లో 134 గ్రామ పంచాయతీలలో, 1259 వార్డులలో, 1418 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ జరగనుందన్నారు.. కర్నూలు డివిజన్ పరిధిలోని కల్లూరు, ఓర్వకల్లు మండలాల్లో 36 గ్రామ పంచాయతీలలో, 331 వార్డులు, 365 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరగనుందన్నారు.. రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు.