ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలి – జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్
విజయనగరం మేజర్ న్యూస్: ఖరీఫ్ 2026-27 ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండాలని జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ అధికారులను ఆదేశించారు. శనివారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ జాయింట్ కలెక్టర్లతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ అనంతరం, జాయింట్ కలెక్టర్ పౌర సరఫరాలు, లీగల్ మెట్రాలజీ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ప్రభుత్వ ఆదేశాల అమలుపై పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ 2026-27 ధాన్యం కొనుగోలుకు సంబంధించి అన్ని ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేశామని, ఇప్పటికే ధాన్యం సేకరణ ప్రారంభించామని తెలిపారు. రైతుల నుంచి ధాన్యం సేకరణకు సంబంధించి ఇప్పటివరకు రైస్ మిల్లర్లు రూ.52 కోట్ల మేర బ్యాంకు గ్యారంటీలు సమర్పించారని వెల్లడించారు. జిల్లాకు నిర్దేశించిన ధాన్యం సేకరణ లక్ష్యానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించి, అందుకు అవసరమైన మేరకు బ్యాంకు గ్యారంటీలు సమర్పించేలా రైస్ మిల్లర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన వాహనాలు, గోనె సంచులను ఇప్పటికే సిద్ధం చేశామని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, కొనుగోలు ప్రక్రియలో ప్రభుత్వ నిబంధనలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని జాయింట్ కలెక్టర్ సూచించారు.