జిల్లాలో 103 కొనుగోలు కేంద్రాలు : ధాన్యం సేకరణ పరిశీలించిన జేసీ భావన వశిష్ఠ
బాపట్ల, మేజర్‌న్యూస్ :
రైతుల పండించిన ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందని జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠ తెలిపారు. వేమూరు మండలం వేమూరు, చావాలి గ్రామాలలో శనివారం ఆమె పర్యటించారు. వేమూరు మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రారంభించారు. కోత తదుపరి ధాన్యం ఆరబెడుతున్న రైతుల వద్దకు వెళ్లి మాట్లాడారు.
బాపట్ల జిల్లాలో అధికంగా సాగు చేస్తున్న ధాన్యం పంట సేకరణ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా సంయుక్త కలెక్టర్ చెప్పారు. 2026-27 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ లో రైతుల నుంచి ధాన్యం సేకరిస్తామన్నారు. ఇందు కొరకు జిల్లాలో 103 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. రైతులు ఎలాంటి ఆందోళనలు చెందరాదన్నారు. 75 కేజీల గ్రేడ్-ఏ ధాన్యం ధర రూ.1,846లు కాగా, కామన్ రకం ధాన్యం ధర రూ.1,831లుగా ప్రకటించిందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గోనె సంచులు, రవాణా కొరకు వాహనాలను సిద్ధం చేశామన్నారు. బయట మార్కెట్లో రైతులు దోపిడీకి గురిగాకుండా ఉండేందుకు కనీస మద్దతు ధరలను ప్రభుత్వం అమలులోకి తెచ్చిందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే తక్కువ ధరకు రైతులు విక్రయించవద్దని సూచించారు. రైతు కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గ్రామాలలో ప్రజలకు విస్తృతమైన అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. రైతుల కొరకు ఏర్పాటుచేసిన ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సేవలను రైతులు వినియోగించుకోవాలని సూచించారు. నాణ్యత ప్రమాణాలకు లోబడి ప్రభుత్వమే ధాన్యాన్ని సేకరిస్తుందన్నారు. ధాన్యం అమ్మకాలలో రైతులకు ఇబ్బందులు ఉంటే తక్షణమే సంబంధిత అధికారులను సంప్రదించవచ్చన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో ధాన్యం అమ్ముకోవచ్చన్నారు.
ఈ కార్యక్రమంలో రేపల్లె ఆర్డీఓ శ్రీదేవి, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ ఆర్.గణనాథ్, డి ఎస్ ఓ జగన్ మోహన్ రావు, వేమూరు తహసిల్దార్ పార్వతి, డీసీఎంఎస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.